365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 30,2025: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో BC సెల్ ఏర్పాటు చేయవలసిందిగా PJTAU ఉద్యోగులు, విద్యార్థుల ప్రతినిధులు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యకు కొన్ని రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చారు. ఈరోజు సమావేశమైన PJTAU పాలకమండలి ఈ అంశాన్ని అన్ని కోణాల నుంచి చర్చించింది.

విశ్వవిద్యాలయాల్లో BC సెల్ ఏర్పాటు గురించి 2018 లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇచ్చిన మార్గదర్శకాల గురించి అలాగే 2008 లో అశోక్ కుమార్ ఠాకూర్, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని పాలకమండలి చర్చించింది.

అదేవిధంగా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే గత కొన్ని ఏళ్ల క్రితం BC సెల్ లని ఏర్పాటుచేసిన విషయాన్ని BC ఉద్యోగులు, విద్యార్థులు విశ్వవిద్యాలయ దృష్టికి తీసుకొచ్చిన అంశాన్ని పాలకమండలి విఫులంగా పరిశీలించింది. వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట PJTAU లో BC సెల్ ఏర్పాటు చేసే అంశాన్ని పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.

SC,ST సెల్ ల మాదిరిగానే BC సెల్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. PJTAU బోధన సిబ్బందిలో సుమారు 40 శాతం BC సామాజిక వర్గాలకి చెందినవారు ఉన్నారని అదేవిధంగా బోధనేతర సిబ్బందిలో సుమారు 50 శాతం సిబ్బంది BC సామాజిక వర్గాలకి చెందిన వారు ఉన్నారని ఉపకులపతి అల్దాస్ జానయ్య పాలకమండలికి వివరించారు.

ఇది కూడా చదవండి…భారతదేశంలో తొలిసారి డ్రేపర్ ఫౌండర్స్ ప్రోగ్రామ్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభం..

అలాగే PJTAU విద్యార్థుల్లోనూ సుమారు సగానికి పైగా విద్యార్థులు BC సామాజిక వర్గాలవారే ఉన్నారని జానయ్య పాలకమండలి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో PJTAU లో BC సెల్ ఏర్పాటు చేయడం సబబేనని పాలక మండలి అభిప్రాయపడింది.

BC సమాజానికి చెందిన ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమానికి తీసుకోవలసిన చర్యల గురించి ఈ సెల్ సూచిస్తుందని ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వివరించారు.