365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 23,2025: భగినీ హస్త భోజనం అనేది సోదరీ, సోదరుల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలను తెలియజేసే ఒక ముఖ్యమైన హిందూ సంప్రదాయం. ఇది దీపావళి పండుగ అయిన రెండవ రోజున (కార్తీక శుద్ధ విదియ నాడు) జరుపుకుంటారు.
సోదరి, సోదరులు ఇచ్చిపుచ్చుకోవాల్సినవి ఏమిటి..?
సాధారణంగా ఈ పండుగలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి.. సోదరుడి నుండి సోదరికి: అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి, వారికి సంతోషాన్ని కలిగించడానికి గుర్తుగా బహుమతులు (కానుకలు, చీరసారెలు) ఇస్తారు. జీవితాంతం రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు.
సోదరి నుంచి సోదరుడికి: సోదరి తన సోదరుడికి నుదుట తిలకం (బొట్టు) పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపిస్తుంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, శ్రేయస్సు కోసం దేవుడిని ప్రార్థిస్తుంది. ముఖ్యంగా, తన చేతితో వండిన భోజనం పెడుతుంది.

భగినీ హస్త భోజనం ఎలా జరుపుకుంటారు:
రోజు: కార్తీక శుద్ధ విదియ (దీపావళి అయిన రెండవ రోజు) నాడు జరుపుకుంటారు.
ఆహ్వానం: ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములను తమ ఇంటికి ఆహ్వానిస్తారు.
పూజ, ఆచారం: సోదరులు ఇంటికి వచ్చిన తర్వాత, సోదరి వారికి నుదుట తిలకం దిద్ది, హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపిస్తుంది. కొంతమంది కొన్ని ప్రాంతాలలో కొబ్బరికాయ కూడా ఇస్తారు.
భోజనం: సోదరి ప్రేమతో వండిన వివిధ రకాల వంటకాలతో కూడిన భోజనాన్ని సోదరులు ఆమె చేతితో తింటారు. సోదరి చేతి భోజనం చేయడం వలన అపమృత్యు భయం తొలగిపోతుందని ఒక నమ్మకం.

కానుకలు: భోజనం ముగిసిన తరువాత, సోదరుడు తన సోదరికి కానుకలు/బహుమతి ఇచ్చి, ఆమె పట్ల తన ప్రేమను, బాధ్యతను చాటుకుంటాడు.
ఈ పండుగ సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయత, అనుబంధం బలపడటానికి అద్దం పడుతుంది. దీనిని ఉత్తర భారతదేశంలో ‘భయ్యా దూజ్’ లేదా ‘భాయ్ ధూజ్’ అని, నేపాల్‌లో ‘భాయి టికా’ అని కూడా పిలుస్తారు.