365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 24 జూన్, 2023: రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా భీమదేవరపల్లి బ్రాంచి థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. ఒకమనిషికి హఠాత్తుగా డబ్బువస్తే ఆవ్యక్తిని, సమాజం అతనిపట్ల నడుచుకునేతీరును చాలా బాగా చూపించారు.
డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు జనాలు ఎలా స్పందిస్తారనే దానిగురించి చెబుతూనే, కొన్ని సందర్భాల్లో కొందరి అవకాశాన్ని అవసరంగా మలుచుకుని ఎలా బురిడీ కొట్టిస్తారనే సన్నివేశాలు ప్రస్తుత జనరేషన్ కు కాస్త కనువిప్పు కలిగిస్తాయి. మానవ సంబంధాలు, ఇంకొంచెం సెంటిమెంట్ పెంచితే బావుండేది..
కథ:
జంపన్న (అంజి వాల్గుమాన్) తన తల్లి సమ్మక్క (రాజవ్వ) భార్య స్వరూప (సాయి ప్రసన్న కొండ్ర)తో కలిసి భీమదేవరపల్లిలో సాధారణ జీవితాన్ని గడుపుతాడు. ఒకరోజు సమ్మక్క బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమవుతాయి. ఆ తరువాత అతను ఆ డబ్బును ఖర్చు చేశాక ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. ఆ నిజం తెలుసుకున్న తర్వాత ఏమి జరుగుతుంది అనేది కథ సారాంశం.
విడుదల తేదీ : జూన్ 23, 2023
365Telugu.com రేటింగ్ : 3.5
నటీనటులు: అంజి వల్గుమాన్, ప్రసన్న, అభి రామ్, రూప శ్రీనివాస్ తదితరులు
దర్శకుడు: రమేష్ చెప్పాల
నిర్మాతలు: బత్తిని కీర్తి లత గౌడ్ – సీహెచ్. రాజా నరేందర్
సంగీత దర్శకులు: చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ: కె. చిట్టి బాబు
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి..
ప్లస్ పాయింట్లు:
నటుడు అంజి వల్గుమాన్ తన సహజమైన కామెడీతో ఆకట్టుకునే నటనతో అందరినీ మెప్పించాడు. సమ్మక్క పాత్రలో రాజవ్వ కూడా అద్భుతంగా నటించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అక్కడక్కడా హాస్య సన్నివేశాలు ఫస్ట్ హాఫ్‌లో నవ్వులు పూయిస్తాయి. అదనంగా, రెండు పాటలు వినడానికి బాగున్నాయి.
మైనస్ పాయింట్లు:
ఫస్ట్ హాఫ్ వరకు బాగానే సాగినా సెకండాఫ్ లో కథ డివైడ్ అయి డల్ గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే స్లోగా ఉంది. అంతేకాదు ప్రభుత్వ ఉచిత పథకాలు అనే అంశంపై డిబేట్ సీన్ మరీ ఎక్కువగా అనిపించింది. ఆ చర్చ సమయంలో అసలు సినిమా చుస్తున్నామా..? న్యూస్ ఛానెల్లో డిబేట్ చుస్తున్నామా..? అన్నంతగా ఉంది. ఇది సినిమాలో కొద్దిగా మైనెస్ పాయింటే.. పొరపాటున వేరొకరి ఖాతాలో డబ్బు జమ చేయడం వెనుక కారణం వేరే ఉంది. దానిపైనే సినిమాని లాకొచ్చారు.
ప్రేమ జంట, అభి (అభిరామ్ వోల్లా), కావేరి (రూపా శ్రీనివాస్) లకు సినిమాలో తక్కువ ప్రాముఖ్యత ఉంది. సుధాకర్ రెడ్డి కేతిరి పాత్రను ఇంకా బాగా డెవలప్ చేసి ఉండాల్సింది. దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్ అయిన రమేష్ చెప్పాల, వేగంగా సాగే కథనంతో స్క్రిప్ట్‌ని రూపొందించారు.
సాంకేతిక అంశాలు:
రమేష్ చెప్పాల కథ, స్క్రీన్‌ప్లే విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు ద్వితీయార్ధంలో కొన్ని సీన్స్ మరింత మెరుగ్గా ఉండేవి. సంగీతం, సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉన్నాయి. ఎడిటర్ సెకండాఫ్‌లో అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసి మరింత మెరుగ్గా అందించవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ యావరేజ్ గా ఉన్నాయి.
ఫైనల్ జడ్జిమెంట్:
మొత్తం మీద..భీమదేవరపల్లి బ్రాంచి సినిమా బలగం సినిమాలా తీయాలనుకున్నారు. అదే రకంగా ఊరి జనాలను ఏకతాటిపై నడిపించేలా ఉంటే ఇంకా బాగుండేది. కామెడీ చాలా బాగుంది. అంజి తన పాత్రకి న్యాయం చేశాడు. ఈ సినిమా తర్వాత అంజి వల్గుమాన్ కు మరిన్ని అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి.
365Telugu.com రేటింగ్ : 3.5.