365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, నవంబర్ 15, 2025: తెలుగు చిత్ర పరిశ్రమను కొన్నేళ్లుగా పట్టి పీడిస్తున్న అతిపెద్ద పైరసీ వెబ్‌సైట్ ‘ఐ బొమ్మ’ (iBomma) నిర్వాహకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వేల కోట్ల నష్టానికి కారణమవుతున్న ఈ సైట్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు అరెస్ట్ చేశారు.

విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు, సినీ పరిశ్రమకు సవాల్ విసురుతున్న ఇమ్మడి రవి, తాజాగా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి వచ్చినట్టుగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు.

కరేబియన్ దీవుల నుంచి పైరసీ ఆపరేషన్..

పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్‌సైట్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. థియేటర్లలో, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్లను ఉచితంగా తమ వెబ్‌సైట్‌లో పెట్టేవారు.

దీని కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. గతంలో, పోలీసులు తమపై దృష్టి సారిస్తే తాము కూడా ప్రతిదాడి చేస్తామని ఐ బొమ్మ నిర్వాహకులు బహిరంగంగా లేఖలు విడుదల చేయడం సంచలనం సృష్టించింది.

మూడు కోట్ల నగదు ఫ్రీజ్..

నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇమ్మడి రవి బ్యాంకు అకౌంట్లలో ఉన్న సుమారు రూ. 3 కోట్ల రూపాయల నగదును సీజ్ (Freeze) చేశారు. అలాగే, అతని సర్వర్‌లో ఉన్న పైరసీ మూవీ కంటెంట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుతో పైరసీపై పోరులో కీలక ముందడుగు పడిందని టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలను పోలీసులు సోమవారం మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది.