365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 13, 2025: భారతదేశంలో స్థిరమైన బయోలాజికల్ వ్యవసాయంపై దృష్టి సారించిన అతిపెద్ద సమావేశం ‘బయోఅగ్రి 2025’ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే పురాతన అగ్రికల్చరల్ బయోలజీ సంస్థ బీపా (BIPA) ఈ సదస్సును నిర్వహిస్తోంది.
సమావేశంలో నిపుణులు మాట్లాడుతూ, భారతదేశం నుండి ఏటా ₹50,000 కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఎగుమతి రంగం ప్రస్తుతం క్రిమిసంహారక అవశేషాలు (పెస్టిసైడ్ రెసిడ్యూ) అనే నిశ్శబ్ద ముప్పును ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
యూరోపియన్ యూనియన్, జపాన్, ఇరాన్ వంటి కీలక మార్కెట్లు ‘క్లీన్ రైస్’ ను కోరుకుంటున్న నేపథ్యంలో, ట్రైసైక్లోజోల్ వంటి ఫంగిసైడ్‌లపై MRL (గరిష్ట అవశేష పరిమితి) ని EU 0.01 ppm కు తగ్గించింది. అంటే 100 టన్నుల బియ్యంలో కేవలం ఒక గ్రాము మాత్రమే అనుమతి.
2020లో EUకు బియ్యం తిరస్కరణ కేసులు 3 ఉండగా, 2024 నాటికి అవి 37కి పెరిగాయని నిపుణులు వెల్లడించారు. ఎగుమతులు పెరిగినంత వేగంగా తిరస్కరణల ప్రమాదం కూడా పెరగడం ఆందోళనకరం.
దేశీయంగా కూడా 300-400 మిలియన్ల మధ్యతరగతి వినియోగదారులు క్రిమిసంహారక అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటున్నారని వారు తెలిపారు.

తక్షణమే ‘నేల ఆరోగ్య విధానం’ అవసరం..
సదస్సును ప్రారంభించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (NIPHM) డైరెక్టర్ జనరల్ డా. సాగర్ హనుమాన్ సింగ్ మాట్లాడుతూ, “భారతదేశానికి తక్షణమే Soil Health Policy (నేల ఆరోగ్య విధానం) అత్యవసరం.
యూరప్-అమెరికా లాంటి దేశాల మాదిరిగా మనకు స్వతంత్ర జాతీయ విధానం కావాలి. రసాయన వ్యవసాయం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింది. ప్లాంట్ హెల్త్, హ్యూమన్ హెల్త్ రెండూ వేరు చేయలేనివి.
మార్గదర్శకాలు, పునరుద్ధరణ కార్యక్రమాలు అవసరం,” అని అన్నారు. మిర్చి వంటి తెలంగాణ పంటలు కూడా అధిక పెస్టిసైడ్ వాడకం వల్ల ఎగుమతులకు అనర్హమవుతున్నాయన్నారు.
బయోలాజికల్ వ్యవసాయం ప్రత్యామ్నాయం కాదు, తప్పనిసరి!
ప్రొఫెసర్ ఎం.ఎస్. రెడ్డి తన కీనోట్ ప్రసంగంలో “బయోలాజికల్ అగ్రికల్చర్ ప్రత్యామ్నాయం కాదు భారత వ్యవసాయ విప్లవానికి ఇది తప్పనిసరి. అలసిపోయిన నేలలు, నీటి ఒత్తిడి, వాతావరణ మార్పులు, రెసిడ్యూ సమస్యలు.. వీటన్నింటి కారణంగా బయోలాజికల్ అగ్రికల్చర్ అనివార్యం అయ్యింది,” అని స్పష్టం చేశారు.
డా. బకుల్ జోషి మాట్లాడుతూ, “పార్కులు ఖాళీగా ఉన్నాయి, ఆసుపత్రులు మాత్రం నిండిపోతున్నాయి. ఆరోగ్యమైన నేలలు అంటే ఆరోగ్యమైన నగరాలు. రసాయన ఆధారిత వ్యవసాయం నుంచి మనం మారాల్సిందే,” అని పిలుపునిచ్చారు.

మాజీ వీసీ, ప్రొఫెసర్ వీ. ప్రవీణ్ రావు పబ్లిక్-ప్రైవేట్ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. డా. జాన్ పీటర్, అధ్యక్షుడు, బీపా, బయోలాజికల్ వ్యవసాయం భారత వారసత్వమని గుర్తుచేశారు.
బీపా కార్యదర్శి డా. వెంకటేశ్ దేవనూర్, బీపా అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వ్యవసాయ జీవశాస్త్ర సంస్థ అని తెలిపారు. ఈ ఐదవ ఎడిషన్ యొక్క థీమ్ “Nurturing Nature, Nourishing the Future.” అని వెల్లడించారు. ఈ సదస్సులో 200కు పైగా ప్రతినిధులు, 40కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి.
