365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, ఆగస్టు 28, 2020: కొవిడ్-19 మహమ్మారి ఎన్నో వ్యాపారాలను కుదేలు చేయడమే కాదు, అనేక జీవితాలు, కలలను ఛిద్రం చేసింది కూడా! అయితే, ఇలాంటి కష్టకాలంలో కూడా ధైర్యాన్ని సంతరించుకుని విజయాలు సాధించి తమ విజయగాధలను భవిష్యత్తు తరాలకు చెప్పేందుకు కొందరున్నారు. అలా విజయవంతంగా జీవిస్తూ, ప్రపంచం నలుమూలలా ఉన్నవారికి స్ఫూర్తికలిగిస్తున్న కొందరి జీవితాల సంగ్రహమే ‘నో రిఫరెన్స్ పాయింట్.ప్రముఖ అంతర్జాతీయ కీలక వక్త, కార్పొరేట్ శిక్షకుడు, సాలోచనాపరుడు అయిన జేవీసీ శ్రీరామ్ రాసిన ‘నో రిఫరెన్స్ పాయింట్’ పుస్తకాన్ని బుధవారం నిర్వహించిన డిజిటల్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. కొవిడ్ ప్రభావం చాలా వ్యాపారాలు, పరిశ్రమలపై పడినా, కొన్ని మాత్రం ఈ సంక్షోభం నుంచి బయటపడిన తీరును, జీవితంలోని వివిధ అంశాలను, వాణిజ్యం తీరును ఈ పుస్తకం వివరిస్తుంది.పుస్తకావిష్కరణ సందర్భంగా రచయిత జేవీసీ శ్రీరామ్ మాట్లాడుతూ, ‘‘ఇది మునుపెన్నడూ లేని సంక్షోభం. ఇలాంటి పరిస్థితిని మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు! ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా మానవాళిని అతలాకుతలం చేస్తున్న ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నాయి. ఇంకా చాలాకాలం పాటు ఈ పరిస్థితిలోనే మనుషులంతా బతకాల్సి ఉంటుంది గానీ, ఇలాంటి సమయంలోనే మనం మేలుకొని, విజయవంతంగా ఎదగడం అవసరం. ఈ సమస్యాత్మక సమయంలోనూ కొత్త ఎత్తులు చూసి, విజయాలు సాధించిన వివిధ వ్యక్తుల జీవితాలను ‘నో రిఫరెన్స్ పాయింట్’ ఆవిష్కరిస్తుంది’’ అని తెలిపారు.ఈ పుస్తకంపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇలా చెప్పారు.. ‘‘కొవిడ్ 19 మహమ్మారి క్రీడారంగం సహా మానవ జీవితంలోని అన్ని రంగాలనూ తీవ్రంగా దెబ్బతీసింది. జేవీసీ శ్రీరామ్ చేసిన పరిశోధన, ఆయన తీసుకున్న ఉదాహరణలు చాలా బాగున్నాయి. మధ్యలో చెప్పిన పిట్టకథలు ఆకర్షణీయంగా ఉన్నాయి. కార్యాచరణ చాలా స్పష్టంగా ఉంది. ఈ కష్టకాలంలో విజయం సాధించడానికి ఈ పుస్తకం తప్పక చదవాలి’’ అన్నారు.పుస్తకంలో మూడు భాగాలున్నాయి. మొదటి భాగంలో వుకా ప్రపంచ లక్షణాలు, మార్పు, మార్పు ప్రభావం గురించి ఉంటుంది.
రెండోభాగంలో మన రోజువారీ జీవితంలో మార్పులు చేసుకోవడం, కొన్ని సంస్థలు పాటిస్తున్న మంచి అలవాట్లు ఉంటాయి. ఇక చివరి భాగం పలువురు పరిశ్రమల యజమానులు, సీఈవోలు, డాక్టర్లు, పారిశ్రామిక సలహాదారులు, ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు, పరిశ్రమల అధినేతలతో రచయిత జరిపిన సంభాషణల సంగ్రహం ఉంటుంది.డెలాయిట్ ఇండియా ఛైర్మన్ పి.ఆర్. రమేష్, అమెరికాలో బీఎన్ఐ వ్యవస్థాపకుడు, ఎన్ వై టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ డాక్టర్ ఇవాన్ మిస్నర్, భారత సైన్యంలో సీనియర్ కర్నల్ కమాండెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ కపూర్ (ఏవీఎస్ఎం, వీఎస్ఎం), మాజీ ఉన్నతాధికారి సంజయ్ కౌల్తదితర ప్రముఖులు రచయితపై ప్రశంసల జల్లు కురిపించారు.ఇండిక్ అకాడమీ గురించి:ఇండిక్ అకాడమీ అనేది సంప్రదాయ విజ్ఞానానికి సంబంధించి సంప్రదాయేతర విశ్వవిద్యాలయం లాంటిది. భారతీయ సాంస్కృతిక, స్వదేశీ ఆలోచనల ఆధారంగా అంతర్జాతీయ పునరుజ్జీవనోద్యమం తీసుకు రావాలన్నది ఇండిక్ అకాడమీ లక్ష్యం. కాలం, స్థలం, కారణం.. ఈ మూడింటితో ఒక బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది. ఇందుకోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, మేధావులను మార్చడం, ఒక కొత్త వాతావరణాన్ని రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.