Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 26,2023: మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మెగా కుటుంబం సందడి చేసింది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఇంత అభిమానం, ఇంత ప్రేమ నాకు సినిమానే ఇచ్చింది. ఒక్కోసారి ఇంత అభిమానం, ప్రేమ కలా నిజమా అనిపిస్తుంది. ఇది నేను కోరుకున్న జీవితం కాదు, భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం. ఏరోజు కూడా చాలా చిన్న జీవితాన్ని బ్రతకాలి అనుకున్నాను తప్ప, ఒక నటుడు అవ్వాలని,

రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ ఊహించలేదు. మీ పట్ల నాకున్న అభిమానం, ప్రేమ నేను మాటల్లో వర్ణించలేను. మీ ప్రేమ, అభిమానం నాలో అణువణువునా ఉంటాయి. సముద్రఖని గారు చెప్పినట్లుగా, ఎంతసేపూ సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి.

నేను సినిమా చేసేటప్పుడు సమాజానికి ఉపయోగపడే ఎంతోకొంత చిన్నపాటి ఆలోచన ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఇది చాలా సంపూర్ణమైన సినిమా. కరోనా సమయంలో ఒకసారి ప్రముఖ దర్శకులు, మిత్రులు త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు. సముద్రఖని గారి దగ్గర ఓ కథ విన్నాను, చాలా బాగుందని చెప్పారు.

నాకు ఒకసారి కథ నచ్చిందంటే రచయితని గానీ, దర్శకుడిని గానీ సంపూర్ణంగా నమ్మేస్తాను. అంత నమ్మకంగా ఈ సినిమా చేశాను. సముద్రఖని గారు రాసిన కథకి త్రివిక్రమ్ గారు సరికొత్త స్క్రీన్ ప్లే అందించారు. ముఖ్యంగా అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయన స్క్రీన్ ప్లే చాలా బాగా డెవలప్ చేశారు.

ఒక విషయంలో నేను సముద్రఖని గారికి అభిమానిని అయ్యాను. మనలో చాలామందికి తెలుగుభాష సరిగా చదవడం, పలకటం రాదు. ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నాం. మన మాతృభాష బలంగా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను సరిదిద్దుకుంటూ ఉంటాను. అలాంటిది సముద్రఖని గారు మన భాష కాదు, మన యాస కాదు.

మొదటిరోజు నేను స్క్రిప్ట్ రీడింగ్ కి వెళ్తే, అక్కడ ఆయన స్క్రిప్ట్ చదువుతూ కనిపించారు. ఆయన తమిళ్ లోనో, ఇంగ్లీష్ లోనో రాసుకొని చదువుకుంటున్నారు అనుకున్నాను. వెళ్లి చూస్తే అది తెలుగు స్క్రిప్ట్. మీకు తెలుగు వచ్చా అని అడిగితే, ఈ సినిమా కోసం కొన్ని నెలల నుంచి నేర్చుకుంటున్నాను అని చెప్పారు.

ఆయన మన తెలుగు నేర్చుకున్నారు కాబట్టి నేను ఆయనకు మాట ఇస్తున్నాను. నేను తమిళ్ నేర్చుకొని, ఒకరోజు తమిళ్ లో స్పీచ్ ఇస్తాను. సముద్రఖని గారు ఇంత తెలుగు నేర్చుకుంటే, తెలుగు మాతృభాషగా ఉన్న మనం ఇంకెంత తెలుగు నేర్చుకోవాలి అని కనువిప్పు కలిగేలా చేశారు. గొప్ప రచయితలు, దర్శకులు కావాలంటే మాతృభాష మీద పట్టుండాలి.

మాతృభాష మీద, మన సాహిత్యం మీద పట్టుంటే గొప్ప గొప్ప సినిమాలు వస్తాయి. ఇది నేను కనీసం 50 నుంచి 70 రోజులు చేయాల్సిన సినిమా. సినిమా అంటే ఇష్టం నాకు, కానీ సమాజం అంటే బాధ్యత. సినిమా అంటే ప్రేమ నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారిలా, రామ్ చరణ్ లాగా నేను గొప్పగా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు.

ప్రభాస్ గారిలా, రానా గారిలా సంవత్సరాలు కష్టపడి చేయలేకపోవచ్చు. సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందినది కాదు. మా కుటుంబానికి కూడా చెందినది కాదు.. ఇది అందరిదీ. ఈ కోట్లాదిమందిలో ఎవరైనా సరే బలంగా అనుకుంటే ఇక్కడ రాణించగలరు.

చిరంజీవి గారు దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. అప్పుడు మా వెనక ఎవరు లేరు. చిరంజీవి గారు హీరో అవుతావా అని అడిగినప్పుడు నాకు హీరో అవ్వాలనే ఆలోచన లేదు. నా ఊహ అంతా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకోవాలి, ఎక్కడైనా దూరంగా పొలంలో పని చేసుకోవాలి. అంతకుమించి కోరికలు లేవు.

కానీ నాకు సాహిత్యం, మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టముండేది. దానివల్ల ఎటూ తేల్చుకోలేకపోయాను. అప్పుడు మా వదిన గారు నాకు మార్గనిర్దేశం చేశారు. అలా మనల్ని నమ్మి, ఏంకాదు చేయమని ప్రోత్సహించేవాళ్ళు కావాలి. నేను సుస్వాగతంలోని ఒక సాంగ్ షూటింగ్ కోసం అప్పుడు వైజాగ్ వెళ్ళాను. అక్కడ బస్సు పైన డ్యాన్స్ వేయమన్నారు.

ఆరోజు నాకు ఏడుపొచ్చేసింది. పదిమంది ముందు నటించాలంటే, డ్యాన్స్ చేయాలంటే నాకు సిగ్గు. అప్పుడు మా వదినకి ఫోన్ చేసి చెప్పాను. నన్ను సినిమాల్లోకి వెళ్ళమని చెప్పకపోతే ఎక్కడో మారుమూల ప్రశాంతంగా ఉండేవాడిని కదా అన్నాను. ఆరోజు మా వదిన చేసిన పనే ఈరోజు నన్ను ఇలా మీ ముందు నిలబెట్టింది. చిరంజీవి గారు కష్టపడి సాధించుకున్నారు.

నేను ఆయన తమ్ముడిగా వచ్చాను. నేను ఏదీ గ్రాంటెడ్ గా తీసుకోను. ఆయన పది కష్టపడితే, నేను దానికి మించి కష్టపడాలని నిర్ణయించుకున్నాను. పైకి సున్నితంగా కనిపిస్తాను కానీ నేను మొరటు మనిషిని. నాలోపల ఒక రైతు ఉంటాడు. నాకు తెలిసిందల్లా త్రికరణశుద్ధిగా పనిచేయడం. అదే కోట్లాది మంది అభిమానాన్ని చూరగొనేలా చేసింది.

సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. కష్టపడి పనిచేద్దాం. గొడ్డుచాకిరి చేస్తాం మేము. దెబ్బలు తగిలించుకుంటాం, కడుపులు మాడ్చుకుంటాం, నష్టాలు వస్తే తీసుకుంటాం. సినిమాల ద్వారా అందరినీ ఆనందింపజేయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం.

ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు, మీరందరూ ఏది అనుకుంటే అది ఎందుకు సాధించలేరు. నాకు ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. నేను, త్రివిక్రమ్ గారు ఎక్కువగా సాహిత్యం, సైన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆయన ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. అంత చదువుకొని సినిమా మీద మక్కువతో ఇక్కడికి వచ్చి అద్భుతమైన రచయితగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు. నీ స్నేహితుడిని చూపించు, నువ్వు ఏంటో చెప్తాం అంటారు. నాకు త్రివిక్రమ్ గారు స్నేహితుడు అయినందుకు మనస్ఫూర్తిగా ఆనందిస్తాను. ఆయను గురువు స్థానంలో పెడతాను. ఎందుకంటే ఆయన నుంచి పురాణాలు, సాహిత్యం గురించి ఎంతో నేర్చుకోవచ్చు. మహా పండితుడు ఆయన. తెలుగు భాష మీద మక్కువ కలగడానికి త్రివిక్రమ్ గారి వంటివారు మార్గనిర్దేశం చేస్తున్నారు.

ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సాహిత్య విలువలున్న యువ రచయితలు సినీ పరిశ్రమకి రావాలి. రాజమౌళి గారు మన పరిశ్రమని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. మహేష్ బాబు గారితో ఆయన చేసే సినిమా మన స్థాయిని మరింత పెంచాలి. దీనిని కొత్తగా వచ్చేవాళ్ళు కొనసాగించాలి. నాకు అందరూ హీరోలు ఇష్టం. వారివల్ల ఎందరో కడుపు నిండుతుంది.

అందరూ బాగుండాలని కోరుకుంటూనే, మన పెద్ద హిట్ కొట్టాలని కసిగా పనిచేయాలి. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. నేను ఈ సినిమా 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయగలిగాను అంటే దానికి కారణం దర్శకుడు సముద్రఖని, డీఓపీ సుజిత్ వాసుదేవ్. థమన్ తో ఇది నాకు హ్యాట్రిక్ ఫిల్మ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను.

సాయి ధరమ్ తేజ్ నటుడు కావాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, నా బాధ్యతగా యాక్టింగ్ స్కూల్ లో చేర్పించాను అంతే. తన కష్టం మీద ఇక్కడివరకు వచ్చాడు. సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాను. తను స్పృహలో లేడు. ఈరోజు తేజ్ ఇక్కడ నిలబడి మళ్ళీ సినిమా చేయగలిగాడు అంటే ఆరోజు కాపాడిన అబ్దుల్ అనే కుర్రాడు కారణం.

ఆస్పత్రిలో సాయి తేజ్ ని చూసి ఏం చేయలేని పరిస్థితిలో కాపాడమని దేవుడిని కోరుకున్నాను. తేజ్ పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ సినిమా సాయి తేజ్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారే సూచించారు.

ఈ సినిమాని వేగంగా పూర్తి చేయడానికి ముందే సెట్లు రెడీ చేసి పెట్టుకొని, సరైన ప్రణాళిక చేసిన నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నవ్విస్తుంది, బాధపెడుతుంది. గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం.

ఇలాంటి చక్కటి సినిమాని అందించిన సముద్రఖని గారికి కృతఙ్ఞతలు. తెలుగు పరిశ్రమ లాగే తమిళ పరిశ్రమ కూడా అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అప్పుడే ఆర్ఆర్ఆర్ లాంటి ప్రపంచస్థాయి సినిమాలు చేయగలుగుతాం” అన్నారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ “ముందుగా ఈ సినిమా చేయాలని కళ్యాణ్ మామయ్య చెప్పినప్పుడు సరి చేసేస్తాను అన్నాను. కానీ ఇది ఒక మల్టీ స్టారర్ అని నువ్వు మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నావు, నేను మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అని చెప్పగానే షాక్ అయ్యాను.

సినిమాలో నేను మెయిన్ లీడ్ ఏంటి? మీరు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా? ఊరుకోండి మావయ్య అంటే లేదు నువ్వు చేయాల్సిందే అని చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నారు. నేను బయలుదేరి వెళ్లాను. అక్కడికి వెళ్ళాక కూడా ఆయన నాకు ఫోన్లో చెప్పింది మళ్ళీ రిపీట్ చేశారు. అయితే ముందు సినిమా చేయడానికి నేను ఒప్పుకోలేదు.

ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాబట్టి నాకు మనసు ఒప్పలేదు. కానీ నాకు ఆ విషయం తర్వాత అర్థమైంది. నన్ను ఏడిపించడానికి అలా చెప్పారు. కానీ ఆ ఏడిపించడాన్ని క్యాప్చర్ చేయడానికి సముద్రఖని చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ఎప్పుడో ఓకే అయింది. అయితే అప్పటికి నేను ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను.

నేను దాదాపు 12 రోజుల్లో కోమాలో ఉంటే మా కళ్యాణ్ మామయ్య ప్రతిరోజు సినిమా షూటింగ్ కి వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చి కూర్చునే వాడు. నా చేయి పట్టుకొని నీకేమీ కాదురా అని చెప్పేవాడు. నాకు ప్రతి సారి అది వినపడుతూనే ఉండేది. థాంక్యూ మామయ్య థాంక్యూ సో మచ్ లవ్ యు. అందరి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుంది, అభిమానులందరూ చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకుని తొడగొట్టి ముందుకు వెళుతూ ఉంటారు.

అదైతే ప్రామిస్ చేసి చెప్పగలను. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చిన్న స్పెషాలిటీ ఉంది. వాళ్ళు మొదట్లో చేసిన సినిమా వెంకీ మామ అని చెప్పారు, అందులో ఒక మేనమామను మేనల్లుడిని కలుపుతారు. ఈ సినిమాతో కూడా ఒక మేనమామని, మేనల్లుడిని కలిపారు. సార్ ఇది చాలా స్పెషల్, నాకు ఈ సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది.

జీవితంలో చివరి క్షణం వరకు గుర్తుపెట్టుకునే ఒక గొప్ప మెమరీ ఇది. సముద్రఖని గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్, నేను కథ విన్నప్పుడు ఎలా ఎక్సయిట్ అయ్యానో అదే విధంగా సినిమా తీశారు. హ్యాట్సాఫ్ టు యు. మీరు ఏమైతే ఒక విజన్ తో సినిమాని ఊహించుకున్నారో దాన్ని తెరమీద చూపించారు.

త్రివిక్రమ్ గారికి నేను చాలా చాలా థాంక్స్ చెప్పుకోవాలి. నాకు మా మామయ్యతో, మా గురువుగారితో నటించే అవకాశం ఇప్పించారు. నాతో ఈ పాత్ర చేయించాలనే ఆలోచన ఆయనకే వచ్చింది, అందుకే ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. మా డీఓపీ సుజిత్ గారు చాలా బాగా క్యాప్చర్ చేశారు. మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా అయితే మేము అనుకున్నామో, ఎలా అయితే మేము ఉన్నామో దాన్ని అలాగే క్యాప్చర్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఎడిటర్ నవీన్ నూలి గారికి థాంక్స్. నాతో కలిసి నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈవెంట్ కి వచ్చిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీదకు నేను రావడానికి కారణమైన మా ముగ్గురు మామయ్యలకి నేను ఎల్లకాలం తలవంచే ఉంటాను.” అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “కళ్యాణ్ బాబాయ్, తేజ్ కలిసి ఈ సినిమా చేస్తున్నారని తెలిసి, నేను చేయలేకపోతున్నానని మొదట కొంచెం అసూయ కలిగింది. కానీ దానికి వంద రెట్లు ఆనందం కలిగింది. తేజ్ కి కళ్యాణ్ బాబాయ్ అంటే ప్రత్యేక అభిమానం. ఆయనను ఓ గురువులా భావిస్తాడు. కళ్యాణ్ బాబాయ్ తో సినిమా చేసే అవకాశం తేజ్ కి రావడం నిజంగా సంతోషంగా ఉంది.

తేజ్ కి ఇది మరపురాని చిత్రం అవుతుంది. నాకు ఇప్పటివరకు కళ్యాణ్ బాబాయ్ గురించి ఇలా స్టేజి మీద మాట్లాడే అవకాశం రాలేదు. మాట్లాడాలంటే వణుకొస్తోంది. కానీ బాబాయ్ గురించి కొన్ని మాటల్లో చెప్పడం కష్టం. చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా చేయి, అలా చేయమని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. మీరు ఎదగాలనుకున్న రంగంలోనే కష్టపడి ఎదగండి అని మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మాకు హార్డ్ వర్క్ ఒకటే నేర్పించారు.

అది బాబాయి అయినా మెగాస్టార్ చిరంజీవి గారైనా. బాబాయ్ రాజకీయంగా బయటికి వెళ్లి ఎండ, వానలో తిరుగుతున్నప్పుడు ఒక కొడుకుగా బాధ వేస్తుంది. ఇంత కష్టపడాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మా కుటుంబం నుంచి దూరంగా ఉన్నా మీ కుటుంబాలకు దగ్గరవుతున్నారని ఆనందం మాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆలోచన మాకు సంతృప్తికరం అనిపిస్తూ ఉంటుంది.

బాబాయ్ వెనకాల మీరు ఎప్పుడు ఉంటారని మాకు తెలుసు అదే మా నమ్మకం, అదే మా ధైర్యం. మీరే కాదు మా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ మా కళ్యాణ్ బాబాయ్ ఏం చేసినా అది సినిమాలైనా, రాజకీయాలైనా, సర్వీస్ అయినా అండగా ఉంటాం.

ఫ్యామిలీ గా నేను అయినా వైష్ణవ్ తేజ్ అయినా తేజ్ అయినా, చరణన్న అయినా కళ్యాణ్ బాబాయ్ వెనకాలే ఉంటాం. ఇది ఏదో స్టేజ్ మీద చెప్పే మాట కాదు, మనసు లోపల నుంచి చెప్పే మాట. బ్రో సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. బాబాయ్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు చూశారు, ఇది కూడా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది.” అన్నారు.

వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కూడా మీలాగా మీలో ఒకడిగా ఇక్కడికి వచ్చాను. ఒకటే చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత అనుభవం నాకు లేదు.

నా వయసు ఆయన అనుభవం అంత ఉంది. బ్రో టీమ్ అంతటికీ ఆల్ ది బెస్ట్. కచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. నన్ను ఆహ్వానించిన వారందరికీ స్పెషల్ థాంక్స్.” అన్నారు.

చిత్ర దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ.. “ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి, చెన్నై వచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి బ్రో సినిమా చేశాను. నాకు టైం వచ్చింది కాబట్టే ఇది సాధ్యమైంది. నేనేది ప్లాన్ చేయలేదు, అదే జరిగింది. మన పని మనం చేస్తుంటే మన టైం వస్తుంది.

నేను ఒకసారి త్రివిక్రమ్ అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు నాకొక ఫోన్ కాల్ వచ్చింది. నేను చేసిన సినిమా విడుదలై పది రోజులు అవుతుంది. ఒక 73 ఏళ్ళ పెద్దాయన సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి నాకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పాను. అన్నయ్య కథ చెప్పమంటే ఒక పది నిమిషాల్లో చెప్పాను. ఆయనకు కథ నచ్చి, పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు త్రివిక్రమ్ అన్నయ్య రూపంలో నేను టైంని చూశాను.

వన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. అప్పటినుంచి ఏడాదిన్నర ఈ సినిమా పని మీదే ఉన్నాను. ఎప్పుడూ ఒక్క శాతం కూడా నమ్మకం కోల్పోలేదు. టైం కోసం ఎదురుచూశాను. టైం వచ్చింది. టైం(పవన్ కళ్యాణ్)ని కలిశాను. ఆయనను కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు.

మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయనొక చిరునవ్వు నవ్వారు. దానిని మర్చిపోలేను. 70 రోజులు చేయాల్సిన పనిని 20 రోజుల్లో చేశాను. అంత పవర్ ఉంది, అంత ఎనర్జీ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం అదృష్టం. సోదరుడు తేజ్ తో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు” అన్నారు.

నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ” ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటిరోజు మొదటి షో చూడటం గొప్ప అవకాశం అనుకునేవాడిని. అలాంటిది పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడి ఆయనను దగ్గరనుంచి చూసే అవకాశం దొరికింది. అక్కడనుంచి పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు కలిసి నటించిన మొదటి సినిమా నిర్మించే అవకాశం దక్కింది.

దీనికి త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తోడయ్యాయి. కళ్యాణ్ గారు ఇచ్చిన టైంలో సముద్రఖని గారు సినిమా పూర్తి చేశారు. దీనినే టైం కలిసిరావడం అంటారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఒక అభిమానిగా మీరేం కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు టైంగా విశ్వరూపం చూపించిన ఈ సినిమా మా బ్యానర్ లో 25వ సినిమా కావడం గొప్ప విషయం” అన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “ఈ సినిమా, భగవత్గీతను నర్సరీ రైమ్ అంత సింపుల్ గా చెప్తే ఎంత బాగుంటుందో అంతా బాగా త్రివిక్రమ్ గారు రాశారు. పండితులకు, పామరులకు అర్థమయ్యేలా అంత అద్భుతంగా సముద్రఖని గారు తీశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతిమాట రాసుకోదగ్గది. ఇంతమంచి సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది” అన్నారు.

కథానాయిక కేతిక శర్మ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సముద్రఖని గారికి కృతఙ్ఞతలు. పీపుల్ మీడియా బ్యానర్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. తేజ్ చాలా మంచి మనసున్న వ్యక్తి.” అన్నారు.

కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ.. “నాపై నమ్మకం ఉంచి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసినందుకు సముద్రఖని గారికి ధన్యవాదాలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన మద్దతుని, ప్రోత్సాహాన్ని మర్చిపోలేను. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాలాంటి నూతన నటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించే అవకాశం రావడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది.

ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన నాలో స్ఫూర్తి నింపారు. సాయి ధరమ్ తేజ్ తో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. తేజ్ తో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది.” అన్నారు.

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేనొక పాత్ర చేశాను. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. 18-20 సంవత్సరాల వయసు నుంచే నేను ఆయనను చూస్తున్నాను. ఆయన నవ్వు ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా ఉంటుందో.. ఆయన కూడా అంతే అందమైన మనిషి. సరదాగా నవ్విస్తూ ఉంటారు.

మనిషి అంతా మంచితనం, మనిషి అంతా హాస్యం. ఏ రకంగా ఆయన దగ్గరకు వెళ్తే ఆ రకంగా దర్శనం ఇవ్వగల దైవాంశసంభూతుడు మా పవన్ కళ్యాణ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత విశ్వప్రసాద్ గారు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమాలు తీస్తాను అన్నారు. ఇంతటి గట్స్ ఉన్న నిర్మాత విశ్వప్రసాద్ గారి ఆల్ ది బెస్ట్” అన్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. “అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ, ఆ డబ్బుని దాచిపెట్టుకోకుండా ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా సోదరుడు టీజీ విశ్వప్రసాద్ ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని తీయాలని కోరుకుంటూ మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. “నేను 22 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుండి చూస్తున్నాను. ఆయనలో నేనొక ఎంజీఆర్ గారిని చూశాను. ఎంజీఆర్ గారు ప్రతి సినిమాలో పాటల్లో గానీ, మాటల్లో గానీ ప్రజలకు ఉపయోగపడే పదాలు రాయిస్తారు. పవన్ కళ్యాణ్ గారితో నేను ‘ఖుషి’ చేసేటప్పుడు హిందీ సాంగ్ పెడదాం అన్నారు.

మొదటిసారి తెలుగు సినిమాలో హిందీ పాట అయినా ఏమాత్రం వెనకాడకుండా పెట్టాం. ఆ పాటలో అద్భుతమైన సందేశం ఉంటుంది. ఒక ప్రేమకథలో కూడా సందేశం ఇవ్వాలని ఆరోజుల్లోనే ఆయన ఆలోచించారు. ఎంజీఆర్ గారి లాగా సినిమా ద్వారా ప్రజలకు మంచి చెప్పాలనుకునే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన తెరమీద కనిపిస్తేనే బాక్సాఫీస్ బద్దలవుతుంది. మేనమామ పవన్ కళ్యాణ్ గారితో కలిసి సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. “మా సేనాని పవన్ కళ్యాణ్ గారు, మా హీరో సాయి ధరమ్ తేజ్ గారు, త్రివిక్రమ్ గారు.. ఈ చిత్ర బృందమంతా నాకు కుటుంబసభ్యులు లాంటివారు. దర్శకనిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక పాటల ప్రదర్శన, నృత్య ప్రదర్శన, అభిమానుల కోలాహలం నడుమ ఎంతో వైభవంగా జరిగింది. జీ స్టూడియోస్ తెలుగు హెడ్ నిమ్మకాయల ప్రసాద్, రోహిణి, ఊర్వశి రౌతేలా, యువలక్ష్మి, అలీ రెజా, గణేష్ మాస్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

error: Content is protected !!