365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 18,2024:భారత టెలికాం రంగంలో ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్‌లు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. Vodafone Idea, BSNL వంటి సంస్థలు పెద్దగా పోటీ ఇవ్వలేకపోతున్నప్పటికీ, ఈ పరిస్థితి త్వరలోనే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL, సర్వత్ర అనే విప్లవాత్మక టెక్నాలజీతో జియో, ఎయిర్‌టెల్‌లకు బలమైన పోటీగా నిలవనుంది.
BSNL సర్వత్ర టెక్నాలజీ ఏంటంటే?
BSNL తీసుకువస్తున్న ఈ సర్వత్ర టెక్నాలజీ కస్టమర్లకు ఉన్నతమైన ఇంటర్నెట్ అనుభవాన్ని అందించనుంది. ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) కనెక్షన్ కలిగిన వినియోగదారులు ఎక్కడికి వెళ్లినా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఈ సాంకేతికత ద్వారా లభించనుంది.
వినియోగదారులు వారి ఇల్లు లేదా కార్యాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా, BSNL FTTH సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించవచ్చు.
టెలికాం రంగంలో కొత్త అధ్యాయం
ఈ సరికొత్త సాంకేతికత జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలకు సవాలుగా మారనుంది. ప్రస్తుతం మొబైల్ డేటా ఆధారంగా ఉన్న టెలికాం రంగంలో BSNL సర్వత్ర ప్రవేశం, విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. సర్వత్ర టెక్నాలజీ ద్వారా వినియోగదారులు మొబైల్ డేటాపై ఆధారపడే అవసరాన్ని తగ్గించుకోగలరు.
కేరళలో తొలి పరీక్షలు
BSNL ఇప్పటికే కేరళలో సర్వత్ర టెక్నాలజీపై ట్రయల్స్ నిర్వహించిందని సమాచారం. ప్రస్తుతం ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, త్వరలోనే ఈ సాంకేతికత వినియోగదారులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్రారంభమైతే, రిజిస్ట్రేషన్ ద్వారా వినియోగదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
సర్వత్ర టెక్నాలజీతో గ్రామీణ ప్రాంతాల్లో మార్పు
BSNL సర్వత్ర టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను చేరువ చేస్తోంది. రిజిస్ట్రేషన్ చేసిన వినియోగదారులు ఈ సేవలను పొందగలరు. సర్వత్ర టెక్నాలజీతో BSNL బ్రాడ్‌బ్యాండ్ సేవలలో కూడా భారీ పెరుగుదలను చూసే అవకాశం ఉంది.
BSNL సర్వత్ర ప్రారంభమైతే, భారత టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రధాన కంపెనీలకు దీటైన పోటీగా నిలబడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.