365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 6,2021:‘‘ప్రత్యేక నైపుణ్యం కలిగిన శ్రామికుడి’’ అంశం లో భాగస్వామ్యానికి సంబంధించిన సముచిత వ్యవస్థ నిర్వహణ కు ఉద్దేశించిన ఒక ప్రాథమిక స్వరూపం పై భారతదేశం ప్రభుత్వానికి, జపాన్ ప్రభుత్వానికి మధ్య ఒక సహకార పూర్వక ఒప్పంద పత్రం పై సంతకాల కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
వివరాలు:
నైపుణ్యం కలిగిన భారతీయ శ్రామికులను పంపడానికి, వారిని స్వీకరించడానికి భారతదేశం, జపాన్ ల మధ్య భాగస్వామ్యం, సహకారం ల తాలూకు ఒక సంస్థాగత యంత్రాంగానికి ప్రస్తుత సహకార పూర్వక ఒప్పందం చోటు కల్పిస్తుంది. ఈ వర్కర్ లు జపాన్ లో పద్నాలుగు ప్రత్యేక రంగాల లో పని చేయడానికి అవసరమైన విశిష్ట నైపుణ్యం తో పాటు జపాన్ భాష తాలూకు పరీక్ష లో కూడా అర్హత ను సంపాదించుకొని ఉంటారు. ఈ భారతీయ శ్రామికులకు ‘‘స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్’’ పేరు తో ఒక కొత్త నివాస హోదా ను జపాన్ ప్రభుత్వం మంజూరు చేయనుంది.
అమలు వ్యూహం:
ఈ ఎమ్ఒసి అమలుకు సంబంధించిన తదుపరి చర్యలను తీసుకోవడానికి గాను ఒక సంయుక్త కార్యాచరణ సమూహాన్ని, ఈ ఎమ్ఒసి లో భాగంగా, ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ప్రధాన ప్రభావం:
ఈ సహకార పూర్వక ఒప్పందం (ఎమ్ఒసి) ప్రజలకు-ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందిస్తుంది. శ్రామికులు, వృత్తి నైపుణ్యం కలిగిన వారు భారతదేశం నుంచి జపాన్ కు రాకపోకలను జరపడాన్ని ప్రోత్సహిస్తుంది.
లబ్ధిదారులు:
పద్నాలుగు రంగాలకు చెందిన నిపుణులైన భారతీయ శ్రామికులకు జపాన్ లో పని చేసేందుకు ఇప్పటి కంటే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఆ పద్నాలుగు రంగాలలో.. నర్సింగ్ కేర్; భవనాలను శుభ్రపరచడం; మెటీరియల్ ప్రోసెసింగ్ పరిశ్రమ; పరిశ్రమల లో ఉపయోగించే యంత్రాల తయారీ; విద్యుత్తు, ఎలక్ట్రానిక్ సమాచారానికి సంబంధించిన పరిశ్రమ; నిర్మాణ రంగం; నౌకా నిర్మాణం,నౌకలకు సంబంధించిన పరిశ్రమ; ఆటోమొబైల్ నిర్వహణ; విమానయానం; లాడ్జింగ్ రంగం; వ్యవసాయ రంగం; మత్స్య పరిశ్రమ; ఆహారం,పానీయాల తయారీ పరిశ్రమ; ఆహార సేవల పరిశ్రమ.. వంటి రంగాలు ఉన్నాయి.