365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 27,2025: వ్రతాలు, నియమాలలో భాగంగా ఉపవాసం ఆచరించే భక్తులకు తరచుగా ఎదురయ్యే సందేహం ఇది: ఉపవాసం ఉన్న రోజున గుడికి వెళ్లినప్పుడు దేవుడి ప్రసాదం (తీర్థం) స్వీకరించవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఉపవాస నియమం భగ్నం అవుతుందా? అనే గందరగోళం చాలా మందిలో ఉంటుంది. ఈ అంశంపై పండితులు,శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రసాదం అంటే భోజనం కాదు.. అనుగ్రహం!

పండితుల అభిప్రాయం ప్రకారం, ఉపవాసం అంటే ‘ఆహారం తీసుకోకుండా ఉండటం’ అనే భౌతిక నియమంతో పాటు, ‘ఉపవసతి’ అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం లేదా మన మనస్సును భగవంతునిపై లగ్నం చేయడం అనేదే ప్రధాన లక్ష్యం.

నియమం భగ్నం కాదు: గుడిలో ఇచ్చే ప్రసాదం సాక్షాత్తూ స్వామివారి అనుగ్రహం, కరుణా కటాక్షంగా భావిస్తారు. ఇది భగవంతునికి నివేదించబడిన తర్వాత పవిత్రతను పొందుతుంది. కాబట్టి, భగవంతుని అనుగ్రహాన్ని (ప్రసాదాన్ని) తిరస్కరించడం సమంజసం కాదు, అలా చేయడం ఉపవాస నియమాన్ని ఉల్లంఘించినట్లు కాదు.

పరిమాణంపై దృష్టి.. ఉపవాసం ఉన్నప్పుడు ఆలయాన్ని సందర్శించినప్పుడు ప్రసాదాన్ని తీసుకోవచ్చు. అయితే, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రసాదాన్ని కేవలం ‘అనుగ్రహంగా, సూక్ష్మ పరిమాణంలో’ మాత్రమే స్వీకరించాలి. దానిని టిఫిన్ లేదా భోజనంలా కడుపు నిండా తినకూడదు.

ఉపవాసం రకాన్ని బట్టి నిర్ణయం.. మీరు ఏ రకమైన ఉపవాసం పాటిస్తున్నారనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. నిర్జల ఉపవాసం అంటే నీరు కూడా తీసుకోకపోవడం.. ఈ ఉపవాసంలో ఘన, ద్రవ పదార్థాలు ఏవీ తీసుకోకూడదు కాబట్టి ప్రసాదం తీసుకోవడం సాధారణంగా నిషేధం.

ఫలాహార ఉపవాసం అంటే పండ్లు, పాలు వంటివి తీసుకుంటే.. ప్రసాదం పండ్లు లేదా పాలు వంటి ఉపవాస ఆహార పదార్థాలతో చేసి ఉంటే తీసుకోవచ్చు. ప్రసాదంలో అన్నం, మినపప్పు వంటి ఉపవాస నియమానికి విరుద్ధమైన పదార్థాలు ఉంటే వాటిని విరమించుకోవాలి లేదా చాలా తక్కువగా ముట్టాలి.

ఉపవాసం లక్ష్యం మనసును, బుద్ధిని శుద్ధి చేసుకోవడం. భగవంతుడి ఆశీర్వాదం అయిన ప్రసాదాన్ని పూర్తిగా తిరస్కరించకుండా, మీ ఉపవాస నియమాన్ని బట్టి అతి తక్కువ మోతాదులో స్వీకరించడం ఆమోదయోగ్యం అని పండితులు సూచిస్తున్నారు.