
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుపతి,మార్చి 4,2022: శ్రీ జ్ఞాన ప్రసూనాంబ, శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, స్వర్ణలత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ దంపతులకు స్థానిక శాసన సభ్యుడు బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు,, ఈవో పెద్దిరాజు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. దేవాంగుల మండపంలో అర్చకులు సుబ్బారెడ్డికి తలపాగా కట్టి పట్టు వస్త్రాలు తలమీద ఉంచారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న చైర్మన్ దంపతులు సోమ స్కంధమూర్తి, జ్ఞాన ప్రసూనాంబ కు పట్టు వస్త్రాలు సమర్పించారు.

అనంతరం వాయులింగేశ్వరుడు, కామాక్షి అమ్మవారు, గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకున్నారు. అర్చకులు సుబ్బారెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ, ప్రసాదాలు అందించారు.శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి చైర్మన్ దంపతులకు స్వామి, అమ్మవారి చిత్ర పటాలను అందించారు. టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తరపున హాజరైన ఆయన సతీమణి శ్రీమతి పద్మ ప్రియ స్వామి అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు.
శ్రీకాళహస్తి అభివృద్ధి కి టీటీడీ సహకారం : చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
శ్రీకాళహస్తి ఆలయ అభివృద్ధి కి టీటీడీ నుంచి తగిన సహాయం అందిస్తామని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి కృషి మేరకు కాళహస్తి ఆలయ అభివృద్ధి కి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రూ 20 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు కోసం టీటీడీ నుంచి సహకారం అందిస్తామని సుబ్బారెడ్డి వివరించారు.

శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం సందర్భంగా, గత 22 ఏళ్లుగా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
దక్షిణ భారతదేశంలో గొప్ప శైవక్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతోందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదర్శన కంకణాలు ప్రారంభించినప్పటి నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విశేషంగా పెరిగిందని ఆయన తెలిపారు.తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు పరిసర ప్రాంత ఆలయాల సందర్శనలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా దర్శించుకుంటున్నారని, ఇందుకోసం టీటీడీ తిరుపతి లో అవసరమైన సదుపాయాలన్నీ కల్పించిందని చైర్మన్ చెప్పారు.