365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 28, 2025 : ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్‌కు పట్టం కడుతున్నారు. రొటీన్ చిత్రాలను పక్కన పెట్టి కొత్తదనం కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో, ‘కన్నప్ప’ వంటి పెద్ద సినిమాకు పోటీగా థియేటర్లలోకి వచ్చిన ‘చంద్రేశ్వర’ చిత్రం, పురాతన ఆలయం, ఆర్కియాలజీ నేపథ్యంతో అంచనాలను పెంచింది. మరి ఈ ‘అండర్‌డాగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడే సత్తా ఉందా? చూద్దాం.

కథాంశం ఏమిటి..?

నందివర్మ పర్వతం కింద ఉన్న పురాతన గుడిలోని నిధి కోసం ఆర్కియాలజీ టీమ్ చంద్రగిరికి వస్తుంది. అయితే, ఆ గ్రామ ప్రజలు వారిని అడ్డుకుంటారు. గతంలో జరిగిన దురదృష్టకర సంఘటనల వల్ల గ్రామ ప్రజలు భయంతో ఉంటారు. ఈ గ్రామ రహస్యాలను, హత్యలను చేధించేందుకు సబ్ ఇన్‌స్పెక్టర్ గురు వర్మ (సురేశ్ రవి) రంగంలోకి దిగుతాడు. ఆర్కియాలజీ టీమ్‌లోని అఖిల (ఆశ వెంకటేష్)తో ప్రేమలో పడిన గురు వర్మ, తన దర్యాప్తులో షాకింగ్ నిజాలను తెలుసుకుంటాడు. అసలు ఆ ఊరిలో చావులకు కారణం ఏంటి? నిధి ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే. ట్విస్టులు, మలుపులతో కథ సాగుతుంది.

ఎలా ఉంది?

దర్శకుడు జీవీ పెరుమాళ్ వర్ధన్ ఒక బలమైన కథను ఎంచుకుని, దానిపై మంచి రీసెర్చ్ చేశాడు. సినిమా ఆరంభమే గొప్ప అనుభూతినిస్తుంది. పురాతన గ్రాంథిక భాష, సనాతన ధర్మాలను టచ్ చేస్తూ కథ చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం సినిమాకే హైలైట్, ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. నందివర్మ, విషయ్ గౌడ ఎపిసోడ్ కథకు బలం. ఒక రాజుని ఓడించాలంటే వారి ఆచార వ్యవహారాలపై దెబ్బకొట్టాలనే డైలాగ్, హిస్టారికల్ ఎవిడెన్స్ వంటి పదాల వాడకం దర్శకుడి మేధస్సును చూపుతుంది.

నటీనటుల పర్ఫామెన్స్..

సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సురేష్ రవి నటన ఆకట్టుకుంటుంది. అతని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు సినిమాను లీనమయ్యేలా చేస్తాయి. ఆశ వెంకటేష్ అఖిల పాత్రలో మెప్పిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద హైలైట్. జెరాడ్ ఫిలిక్స్ సంగీతం, ముఖ్యంగా శివుడిపై వచ్చే పాట, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండవచ్చు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

ఆసక్తికరమైన కథ, స్క్రీన్‌ప్లే

సురేష్ రవి, ఆశ వెంకటేష్ ల నటన

జెరాడ్ ఫిలిక్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు

దర్శకుడి రీసెర్చ్, సనాతన ధర్మాలను టచ్ చేసిన విధానం

ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్, సినిమా ప్రారంభ సన్నివేశం

ఇది కూడా చదవండి…హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మైలురాయి: ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’ ప్రాజెక్ట్ ప్రారంభం..

Read This also…River Expands Footprint in Andhra Pradesh with First Vijayawada Store

మైనస్ పాయింట్స్:

పెద్ద స్టార్ కాస్ట్ లేకపోవడం

ద్వితీయార్థంలో మరింత శ్రద్ధ అవసరం

కొన్ని చోట్ల ఎడిటింగ్

తీర్పు
మొత్తంగా, ‘చంద్రేశ్వర’ చిత్రం థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని నిరాశపరచదు. సరైన ప్రమోషన్లతో ఈ సినిమా ‘కార్తికేయ 2’ తరహాలో విజయం సాధించే అవకాశం ఉంది. కంటెంట్ బేస్డ్ చిత్రాలను ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

ట్యాగ్‌లైన్: ‘చంద్రేశ్వర’.. ‘విజయేశ్వర’

సినిమా పేరు: ‘చంద్రేశ్వర’
విడుదల తేదీ: జూన్ 27, 2025
నటీనటులు: సురేశ్ రవి, ఆశ వెంకటేష్, నిళల్‌గళ్ రవి తదితరులు
దర్శకుడు: జీవీ పెరుమాళ్ వర్ధన్
రేటింగ్: 3.25/5.