365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 2,2024: Cheapest Electric Bike: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మరింతగా ఆకర్షితులవుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం వలన పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, మన ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు అని అందరూ భావిస్తున్నారు.
ఈ కారణంగా, ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రతి ఏడాది వృద్ధి చెందుతున్న ఈ ట్రెండ్‌లో, ఎలక్ట్రిక్ వాహనాలు తమదైన మార్క్‌ను చూపుతున్నాయి.
ఈ కోవలోనే, కైనెటిక్ వారు రోజువారీ అవసరాలకు, చిన్న వ్యాపారాలకు అనువుగా ఉండే ఎలక్ట్రిక్ లూనాను విడుదల చేశారు. గతంలో కైనెటిక్ లూనా పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, ఇప్పుడు దీనికి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టిన తరువాత, ఇది మరింత ప్రజాదరణ పొందుతోంది.
ఇ-లూనా గురించి తెలుసుకుందాం. కొత్త ఎలక్ట్రిక్ లూనా ధర రూ.69,990 నుంచి ప్రారంభమవుతుంది. లూనా రన్నింగ్ కాస్ట్ కిలోమీటరుకు కేవలం 10 పైసలు మాత్రమే. పెట్రోల్‌తో నడిచే స్కూటర్‌లతో పోలిస్తే, ప్రతి నెలా రూ. 2,260 వరకు ఆదా చేసుకోవచ్చు.
కంపెనీ తన లెక్కల ప్రకారం ఈ వివరాలను తన వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. ఇ-లూనాను ఫుల్ ఛార్జ్ చేయడానికి 2 యూనిట్లు విద్యుత్ అవసరం. ఎలక్ట్రిక్ లూనా రోజువారీ ఉపయోగం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇది చిన్న వ్యాపారాలకు కూడా చాలా ఉపయోగకరమైన వాహనంగా నిలుస్తుంది.
ఇ-లూనా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది, 1.7kWh ,2kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఈ వాహనం గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు.
ఇ-లూనాలో సేఫ్టీ లాక్, మెరుగైన బ్రేకింగ్ కోసం కాంబి బ్రేక్ సిస్టమ్, 16 అంగుళాల పెద్ద వీల్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ముందు భాగంలో లగేజీ నిల్వ చేసే మంచి స్థలం వంటి అదనపు సౌకర్యాలు ఉన్నాయి. ఇ-లూనా స్టీల్ ఫ్రేమ్‌తో నిర్మించబడింది. దాని మీద 150 కిలోల వరకు వస్తువులను లోడ్ చేయవచ్చు.