Fri. Nov 8th, 2024
CM_KCR-_Tour

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మహబూబాబాద్, జనవరి 12, 2023: మహహబూబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం చేరుకున్న సీఎం కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ శాంతి కుమారితో కలిసి కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం మధ్యాహ్నం1.14 గంటలకు కలెక్టర్ ఛాంబర్ లోని సీటులో కలెక్టర్‌ శశాంక్ ను కూర్చోబెట్టారు సీఎం కేసీఆర్. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్లో జరిగిన సర్వమత ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేమయ్యారు.

మానుకోట సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం..

‘‘ తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్‌ ప్రాంతానికి వచ్చా. అప్పుడు ఇక్కడ చాలా దారుణమైన కరువు పరిస్థితులు ఉండేవి. కండ్లకు నీళ్లు పెట్టుకుని ఏడ్చిన. పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమీ లేకపాయె. తుంగతుర్తి, వర్ధన్నపేట, పాలకుర్తి ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ సగం గీకిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్లు రావు అని చాలా బాధపడ్డా.

CM_KCR-_Tour

ఏటూరునాగారం వచ్చినప్పుడల్లా.. చిల్లర డబ్బులు వేసి తల్లీ గోదావరి మా నేలమీదకు ఎప్పుడొస్తావు, మా కరువు ఎప్పుడు తీరుస్తావు అంటూ దండం పెట్టుకునేవాడిని.

తెలంగాణ వస్తే బంగారు మీసాలు చేయిస్తా అని కొమురువెల్లి స్వామికి మొక్కుకున్నా. స్వామి దయ, మీరు చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ళ బలం అన్నీ కలిసి అద్భుత రాష్ట్రం సాకారమైంది. వెనుకబడిన ప్రాంతాల్లో వెలుతురు నింపడం కోసమే పాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా విస్తరించాం. ఇపుడు మహబూబాబాద్ కూడా జిల్లా అయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతున్నది.

తెలంగాణ వచ్చాక చాలా పనులు చేసుకున్నాం. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఇప్పుడు మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ కలెక్టరేట్‌ ప్రజాసమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలి. తెలంగాణ రాకముందు మనకు 3, 4 వైద్య కళాశాలలు ఉండేవి.

రాష్ట్రం ఏర్పడ్డాక అనేక కొత్త వైద్య కళాశాలలను తెచ్చుకున్నాం. మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చినం. ఇపుడు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి కూడా అనుమతిస్తున్నం. వచ్చే విద్యా సంవత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా చూస్తం.

సీఎం ప్రత్యేక నిధి నుంచి మహబూబాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్ల నిధులిస్తున్నం. మరో మూడు మున్సిపాలిటీలు తొర్రూరు, డోర్నకల్, మరిపెడలకు ఒక్కో దానికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నం, అలాగే, మహబూబాబాద్ జిల్లాలో అనేక తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నం.

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధి మంజూరు మంజూరు చేస్తున్నం. నూకల రాంచంద్రారెడ్డి గారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారు గురువు. అలాంటి మహనీయులను భావితరాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది.

అందుకే వారి కాంస్య విగ్రహాన్ని మానుకోటతోపాటు వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రతిష్టాత్మక సంస్థకు వారి పేరు కూడా పెడతం’’ అని ప్రకటించారు. ‘‘ తెలంగాణలో మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నం.

మొండిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం కాబట్టే తెలంగాణ రైతులకు సాగునీటి సమస్య లేదు. ఇపుడు భూ గర్భ జలాలు పెరిగి బోర్ల నుండి నీళ్లు బయటకు కక్కుతున్నాయి. కానీ, కేంద్రం మాత్రం ఏ అభివృద్ధీ చేస్తలేదు. నదీ జలాలు సద్వినియోగం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అనేక రాష్ట్రాలు నీళ్లకోసం తల్లడిల్లుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది. మత పిచ్చి- కుల పిచ్చితో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టవద్దని కోరుతున్నా. అలాగైతే మన దేశం మరో ఆప్ఘనిస్తాన్ అవుతుంది..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన చెందారు. యువత ఇవన్నీ ఆలోచించి, వైషమ్యాలకు దూరంగా ఉండాలని సీఎం కోరారు.

CM_KCR-_Tour

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితా నాయక్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోతు శంకర్‌నాయక్‌, హరిప్రియా నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ శశాంక్, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ శరత్ చంద్రపవార్ తదితరులతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!