365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 27,2024:మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు ప్రకటించారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడింది.
పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ..
శుక్రవారం జరిగిన కార్యక్రమంలో, హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నగరంలో అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆయన వివరించారు.
శాసన మండలి ఏర్పాటుకు నూతన భవనం..
ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలో అందులో శాసన మండలి ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. జూబ్లీ హాల్ కు చారిత్రక ప్రాధాన్యత ఉన్నందున, దాన్ని ప్రత్యేక టెక్నాలజీతో నిర్మించినట్లు పేర్కొన్నారు. సీఐఐకి ఆ భవనాన్ని దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సూచించారు.
ఉస్మానియా ఆస్పత్రి పునరుద్ధరణ..
ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూడా పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నామని తెలిపారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం..
పురాతన మెట్ల బావులను పునరుద్ధరించడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలను అందజేశారు. ఇన్పోసిస్ సంస్థ మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఒప్పందం చేసుకుంది. అలాగే, సాయి లైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది.
తెలంగాణ దర్శిని కార్యక్రమం..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ దర్శిని కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చారిత్రక, పర్యాటక ప్రాంతాల గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.