Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 12,2023:దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం కాస్త చల్లబడ్డాయి. ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠాలను తాకినప్పటికీ నష్టాల్లోనే ముగిశాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్ వంటి హెవీవెయిట్స్ నష్టపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే సూచీలు గరిష్ఠాలకు చేరడంతో మదుపరులు అప్రమత్తంగా వ్యహరిస్తున్నారు.

కుదిరితే లాభాలను స్వీకరిస్తున్నారు. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 365, ఎన్ఎస్ఈ నిఫ్టీ 96 పాయింట్ల మేర కుంగాయి. కాగా ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి.

అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల నేపథ్యంలో ఐరోపా సూచీలు పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.39 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది.

క్రితం సెషన్లో 69,928 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 70,020 వద్ద మొదలైంది. మరికాసేపటికే 70,033 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఐరోపా మార్కెట్లు తెరిచేంత వరకు రేంజుబౌండ్లో కొనసాగిన సూచీ 69,443 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.

మొత్తంగా 377 పాయింట్ల నష్టంతో 69,551 వద్ద ముగిసింది. మంగళవారం 21,018 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,037 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి చేరింది. 20,867 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి కుంగింది.

చివరికి 90 పాయింట్లు పతనమై 20,906 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 216 పాయింట్లు ఎరుపెక్కి 47,097 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 18 కంపెనీలు లాభపడగా 32 నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ట్రాటెక్ సెమ్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంకు షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.

అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, మారుతీ, కోల్ ఇండియా, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి. నేడు మీడియా, మెటల్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.

బ్యాంకు, ఆటో, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టపోయాయి. నేడు నిఫ్టీ నష్టపోవడంలో రిలయన్స్ (26), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (27) ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయి.

నిఫ్టీ50 డిసెంబర్ ఫ్యూచర్స్‌ ఛార్ట్‌ను గమనిస్తే 21,100 వద్ద రెసిస్టెన్సీ, 20,940 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి టాటా ఎలెక్సీ, అల్ట్రాటెక్ సెమ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, యాక్సిస్ బ్యాంకు షేర్లను కొనుగోలు చేయొచ్చు.

స్పైస్ జెట్ రెండో త్రైమాసికం ఫలితాలు విడుదల చేసింది. వార్షిక ప్రతిపదికన రూ.449 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. అదానీ పోర్ట్స్ రూ.5000 కోట్ల విలువైన ఎన్‌సీడీలు జారీచేసేందుకు ఆమోదం తెలిపింది.

మిశ్రధాతు నిగమ్ రూ.357 కోట్ల విలువైన ఆర్డర్ దక్కించుకుంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పుర్ నుంచి తేజస్ నెట్‌వర్క్ 5జీ టెక్నాలజీ లైసెన్సులు పొందింది.

2024 ఆర్థిక ఏడాదిలో రూ.16,500 కోట్లుగా పెట్టుకున్న క్యాపెక్స్ లక్ష్యంలో డిసెంబర్లోపే 80 శాతం ఖర్చు చేస్తామని కోల్ ఇండియా ప్రకటించింది.

నువామా నుంచి మంచి రేటింగ్ రావడంతో సఫారీ ఇండస్ట్రీస్ షేర్లు 12 శాతం పెరిగాయి. క్యూఐపీ విధానంలో రూ.750 కోట్లు సమీకరణ మొదలు పెట్టడంతో జమ్మూకశ్మీర్ బ్యాంకు షేర్లు జీవిత కాల గరిష్ఠాన్ని తాకాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!