365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 7,2025: అంబర్‌పేటలో ని బతుకమ్మ కుంట పునరుద్ధరణపై హైకోర్టు హైడ్రాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మంగళవారం తుది తీర్పులో బతుకమ్మ కుంట స్థలాన్ని హైకోర్టు చెరువుగా గుర్తించింది.

బతుకమ్మ కుంట భూమి తమదని ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆధారంగా గత 30 సంవత్సరాలుగా తనదిగా చెప్పుకుంటున్న ఎడ్ల సుధాకర్ రెడ్డికి మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది.

హైకోర్టు తీర్పు ప్రకారం, బతుకమ్మ కుంట పునరుద్ధరణలో హైడ్రా తీసుకున్న చర్యలు సక్రమమైనవి అని నిర్ధారించింది. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హైడ్రాను సంప్రదించి సంబంధిత పత్రాలను అందజేశారు.

బతుకమ్మ కుంట పునరుద్ధరణకు సంబంధించిన చర్యలు నవంబర్ 13న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు. ఎడ్ల సుధాకర్ రెడ్డి 14.11.2024న కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది.ఆ తర్వాత హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు సర్వే నంబర్ 563లోని భూ రికార్డులను పరిశీలించి, కోర్టులో కౌంటర్ దాఖలుచేసారు.

గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కరరెడ్డి కోర్టులో వాదనలు విని, ఎడ్ల సుధాకర్ రెడ్డికి ఈ భూమిపై ఏ హక్కులూ లేవని తీర్పు ఇచ్చారు. హైకోర్టు 2017లో ఈ భూమిని చెరువుగా గుర్తించింది. ఫిర్యాదుదారుకు హక్కులున్నా, సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించి అనుకూల తీర్పు సాధించిన హైడ్రా లీగల్ టీమ్,రెవెన్యూ ఉద్యోగులను మంగళవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో సన్మానించారు.

హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ కె. రవీందర్ రెడ్డి, సీహెచ్. జయకృష్ణ, హైడ్రా న్యాయ సలహాదారు శ్రీనివాస్, హైడ్రా లీగల్ విభాగం లైజినింగ్ అధికారి డి. మోహన్, హైడ్రా డిప్యూటీ కలెక్టర్ ఎల్. సుధ, తహసిల్దార్ ఎం. హేమ మాలిని, తహసిల్దార్ పి. విజయ్ కుమార్, అంబర్‌పేట తహసిల్దార్ బి. వీరాబాయి, సర్వేయర్ కిరణ్,ఇతర అధికారులని హైడ్రా కమిషనర్ సన్మానించారు.

హైడ్రా బతుకమ్మ కుంటకు పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి చర్యలు చేపట్టింది.1962-63 లెక్కల ప్రకారం, మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణంగా తేల్చిన సర్వే అధికారులు.

తాజా సర్వే ప్రకారం, మిగిలిన భూమి 5.15 ఎకరాల విస్తీర్ణం. ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది.ఈ పనులు ప్రవేశించిన ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎలాంటి హాని లేకుండా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు ఇచ్చారు.

బతుకమ్మ కుంటకు పునరుద్ధరణలో చెరువు మరల ప్రగతికి కృషి చేస్తున్న హైడ్రా. ఎర్రకుంట ఒకప్పుడు బతుకమ్మ కుంటగా మారిందని స్థానికులు చెప్తున్నారు.బతుకమ్మ కుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయి చెరువు ఆకృతి కోల్పోయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. హైడ్రా బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ చర్యలను చేపట్టనుంది.