Mon. Jun 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 27,2023: హమ్మయ్య! నేడు ఇన్వెస్టర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆరు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడటమే ఇందుకు కారణం. గురువారం వరకు సెల్లింగ్‌ ప్రెజర్‌ ఎదుర్కొన్న బెంచ్‌ మార్క్‌సూచీలు వారాంతంలో భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 634, నిఫ్టీ 190 పాయింట్ల మేర పెరిగాయి.

ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధ భయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ అనిశ్చితి భయపెడుతున్నా నేడు రిలీఫ్‌ ర్యాలీ జరిగింది. కంపెనీల ఫలితాలూ మార్కెట్‌ అంచనాలకు తగ్గట్టే ఉండటం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది.

చాలా కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన విలువల్లో లభిస్తుండటంతో లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఫారిన్‌ ఫోర్టుపోలియో ఇన్వెస్టర్లు ఎప్పట్లాగే నేడూ రూ.1500 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

డీఐఐలు రూ.313 కోట్లతో నెట్‌ బయర్స్‌గా అవతరించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలహీనపడి 83.25 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 63,148 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 63,559 వద్ద మొదలైంది. 63,393 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆరంభం నుంచే క్రమంగా పెరుగుతూ 63,913 వద్ద ఇంట్రాడేలో గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 634 పాయింట్ల లాభంతో 63,782 వద్ద ముగిసింది.

శుక్రవారం ఉదయం 18,928 వద్ద ఆరంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18,926 వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది. ఆ పై పుంజుకొని 19,076 వద్ద గరిష్ఠాన్ని తాకి మొత్తంగా 190 పాయింట్ల లాభంతో 19,047 వద్ద క్లోజైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 501 పాయింట్లు ఎగిసి 42,782 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50 అడ్వాన్స్‌ డిక్లైన్‌ రేషియో 44:6గా ఉంది. కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఎస్బీఐ, బజాజ్ ఆటో షేర్లు టాప్‌ గెయినర్లుగా అవతరించాయి. యూపీఎల్‌, ఐటీసీ, హిందాల్కో, బీపీసీఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌ టాప్ లాసర్స్‌.

నేడు అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్‌ అండ్ గ్యాస్‌ సూచీలు అత్యధికంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ ఏకంగా 4 శాతం ఎగిసింది.

నిఫ్టీ నవంబర్‌ ఫ్యూచర్స్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,200 వద్ద రెసిస్టెన్సీ, 19,000 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి కెనరా బ్యాంకు, ఎస్బీఐ, ఎల్‌టీ, ఇన్ఫీ షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చు. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో స్టాప్‌లాస్‌ను మెయింటేన్ చేయాలి. నిఫ్టీ పెరిగేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, ఎస్బీఐ, ఎల్‌టీ ఎక్కువ కాంట్రిబ్యూషన్‌ అందించాయి.

మొత్తంగా ఈ వారం మీడియా రంగం ఐదు శాతానికి పైగా నష్టపోయింది. మెటల్‌, రియాల్టీ రంగాల పైనా దెబ్బపడింది. అదానీ గ్రూప్‌ షేర్లలో నేడు అన్నీ లాభపడ్డాయి. అదానీ పవర్‌, అదానీ విల్మార్‌, గ్రీన్‌ఎనర్జీ, టోటల్‌ గ్యాస్‌ ఎక్కువ పెరిగాయి.

ఇండియన్‌ హోటల్స్‌ క్యూ2 ఫలితాలు వచ్చాయి. వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 16.27 శాతం పెరిగి రూ.1433 కోట్లుగా నమోదైంది. మారుతీ సుజుకీ షేర్లు ఏకంగా నాలుగు శాతం పెరిగాయి. క్యూ2 ఆదాయం 23.82 శాతం పెరగడమే ఇందుకు కారణం. క్యాలెండర్‌ ఇయర్‌ మూడో త్రైమాసికంలో షాఫ్లర్‌ ఇండియా ఆదాయం 5.53 శాతం ఎగిసి రూ.1853 కోట్లుగా ఉంది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.