365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 13, 2025: సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న వైద్యులు, బాధ్యతాయుత పౌరుల సమిష్టి సంస్థ DEEP ట్రస్ట్, తన 11వ వార్షికోత్సవాన్ని ‘DEEP ఎలివేట్ 2025’ పేరుతో శనివారం సాయంత్రం జూబ్లీ హిల్స్‌లోని హోటల్ దస్పల్లా వేదికగా ఘనంగా నిర్వహించుకుంది.
ఈ వేడుకలో గత దశాబ్దపు ప్రయాణాన్ని స్మరించుకోవడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు.
ఇంటి ముందుకే ఉచిత క్యాన్సర్ పరీక్షలు..
DEEP ఎలివేట్ 2025లో ప్రధాన ఆకర్షణగా DEEP మొబైల్ హెల్త్ & స్క్రీనింగ్ బస్ ప్రారంభం నిలిచింది. రూ. కోటికి పైగా నిధులను వెచ్చించి, పూర్తి సదుపాయాలతో సమకూర్చుకున్న ఈ మొబైల్ యూనిట్‌ను అట్టహాసంగా ఆవిష్కరించారు.
ఈ మొబైల్ బస్సు.. సేవలు అందని మారుమూల ప్రాంతాలకు నేరుగా వెళ్లి ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు, ప్రాథమిక డయాగ్నస్టిక్స్ సేవలను అందించనుంది.
వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం ద్వారా, చివరి దశ చికిత్సల వల్ల వచ్చే ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని DEEP ట్రస్ట్ తెలిపింది. ఈ బస్సు వేలాది మహిళలు, కుటుంబాలకు లబ్ధి చేకూర్చనుంది.
ట్రస్టీలు డా. మధు వాసేపల్లి, శ్రీమతి స్వాతి మోహంతి, శ్రీమతి ప్రియ అయ్యంగార్, డా. ఆర్య యశశ్రీ, ఫణీంద్ర కలిసి ఈ మొబైల్ హెల్త్ బస్‌ను అధికారికంగా ప్రారంభించారు.
50 లక్షల మందికి సాయం లక్ష్యంగా ‘DEEP విజన్ 2030’..

ఈ సందర్భంగా, DEEP ట్రస్ట్.. 50 లక్షల మందికి మేలు చేకూర్చే లక్ష్యంతో రూపొందించిన “DEEP విజన్ 2030″ని స్థాపక ట్రస్టీలు డా. రాకేశ్ కలాపాలా డా. మధు వాసేపల్లి ఆవిష్కరించారు.
సమానమైన ఆరోగ్య సేవలు, నాణ్యమైన విద్య , వినూత్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 50 లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకురావడం ఈ దీర్ఘకాలిక లక్ష్యంగా వారు పేర్కొన్నారు.
అదేవిధంగా, లబ్ధిదారులు సమాచారం, సేవలను సులభంగా పొందేందుకు వీలుగా DEEP మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు.
కార్యక్రమంలో ‘DEEP ఆన్ వీల్స్ (మొబైల్ హెల్త్)’, కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ (KGNMT)లో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ సెంటర్ వంటి ముఖ్య కార్యక్రమాలను ప్రదర్శించారు.
అస్రిత, శ్రీ విద్య, VSS, థారా హోమ్, బాల్యం హోమ్ వంటి పలు సంస్థల్లో అమలు చేస్తున్న విద్యా సహాయక కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధికి విశేష సేవలు అందించిన వాలంటీర్లు, భాగస్వాములను సత్కరించారు. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్, శ్రీ విద్య ప్రత్యేక పిల్లల కేంద్రంకు చెందిన ప్రత్యేక పిల్లలు తయారు చేసిన ఉత్పత్తులను కూడా ప్రదర్శించడం జరిగింది.
