365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, నవంబర్ 10,2025: దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది. చారిత్రక ఎర్రకోట (Red Fort) సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ కారులో సంభవించిన భారీ పేలుడు (Car Blast)లో ఎనిమిది (8) మంది మృతి చెందారు.
ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని మూడు నాలుగు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సంచలనం.. దద్దరిల్లిన ప్రాంతం.. !
సోమవారం సాయంత్రం (నవంబర్ 10, 2025) వేళ లాల్ ఖిలా (ఎర్రకోట) మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో పరిసర ప్రాంతమంతా దద్దరిల్లింది. భారీ శబ్దంతో పాటు దట్టమైన పొగ, మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
హై అలర్ట్.. దర్యాప్తు ముమ్మరం..

ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నగరంలో హై అలర్ట్ (High Alert) ప్రకటించారు. ఎర్రకోట ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేశారు. ఉన్నతాధికారులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS), ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
పేలుడుకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది ప్రమాదమా లేక ఉగ్రవాద చర్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
