365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, ఆగస్టు 13,2025: చెరువులు, నాళాలు, కాలువలు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలంటే ప్రతి రాష్ట్రంలో హైడ్రా వంటి సంస్థలు ఉండాలని ఢిల్లీ మున్సిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది.

మంగళవారం సాయంత్రం అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంటను ఢిల్లీ మున్సిపల్ హార్టికల్చర్ విభాగ అధిపతి డా. ఆశిష్ నేతృత్వంలోని బృందం సందర్శించింది. ఒకప్పుడు చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయిన ఈ ప్రదేశం ఇప్పుడు అందమైన చెరువుగా మారడాన్ని చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ చెరువు పునరుద్ధరణ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని డా. ఆశిష్ తెలిపారు.

వారు చెరువు చుట్టూ తిరిగి అభివృద్ధి పనులను దశలవారీగా పరిశీలించారు. గతంలో ఆక్రమణల నుంచి విముక్తి కల్పించడం, మండు వేసవిలో రెండు మీటర్ల లోతు తవ్వగానే గంగమ్మ తల్లి నీరు ఉబికి వచ్చిన ఘటనల వీడియోలను కూడా వీక్షించారు.

ప్రయోజనాలపై ప్రత్యేక ఆసక్తి
ఈ చెరువు లేనప్పుడు వరదల ప్రభావం ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న విషయాలను కూడా బృందం తెలుసుకుంది. చెరువుకు ఆనుకుని సాగే మురుగు కాలువలో వరదనీరు మాత్రమే చేరేలా ఇన్‌లెట్ నిర్మాణాన్ని పరిశీలించింది. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరదనీరు ఎలా చేరిందన్నది హైడ్రా అధికారులు వీడియోల ద్వారా వివరించారు.

Read This also…NMDC Posts Record Q1 Performance; Revenue Jumps 23% to Rs.6,634 Crore

స్థానికులతో మాట్లాడిన ఢిల్లీ అధికారులు, గతంలో వరదనీరు బస్తీలు, కాలనీలు ముంచెత్తేదని, కానీ ఈసారి ఆ ముప్పు తప్పిందని నివాసులు చెప్పినట్లు తెలిపారు. చెరువు ఔట్‌లెట్లను కూడా బృందం పరిశీలించింది.

ఈ సందర్శనలో హైడ్రా అధికారులు మోహనరావు, బాలగోపాల్, చెరువు అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్ ఎండీ పి. యూనస్‌, హెచ్ఎండీఏ,ASCI అధికారులు కూడా పాల్గొన్నారు.