365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 17,2023:దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. పెద్ద దేశాల్లో ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గడంతో ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.
ఐటీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ రంగాల దన్నుతో బెంచ్ మార్క్ సూచీలు భారీగా పెరిగాయి. సెన్సెక్స్ 66,359, నిఫ్టీ 19,765 స్థాయులను టచ్ చేశాయి. ఐరోపా మార్కెట్లు మొదలవ్వగానే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో కాస్త కుంగాయి.
నేడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.550 కోట్లు, స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.705 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 65,675 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,665 మొదలైంది. కాసేపటికే 65,507 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై పుంజుకొని 66,359 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని చేరుకుంది.
ఐరోపా మార్కెట్లు తెరుచుకున్నాక ఒక్కసారిగా పడిపోయిన సూచీ చివరకు 306 పాయింట్ల లాభంతో 65,982 వద్ద ముగిసింది. గురువారం 19,673 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,627 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.
19,875 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొని మొత్తంగా 89 పాయింట్లు పెరిగి 19,765 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ బ్యాంకు 40 పాయింట్లు ఎరుపెక్కి 44,161 వద్ద స్థిరపడింది.
నిఫ్టీలో 32 కంపెనీలు లాభపడగా 18 నష్టపోయాయి. హీరో మోటో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫీ షేర్లు దుమ్మురేపాయి. యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ టాసర్స్.

ఐటీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ రంగాల సూచీలు అదరగొట్టాయి. రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, మీడియా సూచీలు ఫర్వాలేదనిపించాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ మాత్రం ఎక్కువ ఎరుపెక్కింది.
నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,700 వద్ద సపోర్టు, 19,850 వద్ద రెసిస్టెన్సీ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, ఒబెరాయ్ రియాల్టీ షేర్లను కొనొచ్చు.
ఉదయం నుంచీ నష్టాల్లో మూడు శాతానికి పైగా నష్టాల్లో ట్రేడైన మోతీలాల్ ఓస్వాల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఆఖర్లో బాగా పెరిగాయి. రూ.940.95 చొప్పున ఐసీఐసీఐ బ్యాంకులో 20.3 లక్షల షేర్లు చేతులు మారాయి.
రూ.2,368 చొప్పున రిలయన్స్ ఇండస్ట్రీలో 10.6 లక్షల షేర్లు చేతులు మారాయి. వర్క్‌హార్ట్ షేర్లు 19 శాతం పెరిగాయి. ఒంటికి ధరించే మైగ్రేన్ మేనేజ్మెంట్ పరికరం నెరివియోను డాక్టర్ రెడ్డీస్ భారత మార్కెట్లో ఆవిష్కరించింది.

బాలకృష్ణ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, వరుణ్ బేవరేజెస్, టీవీఎస్ మోటార్స్, టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. జ్యోతీ లాబ్స్ షేర్లు 5 శాతం పెరిగాయి. పెన్నార్ ఇండస్ట్రీస్‌కు వేర్వేరు కంపెనీల నుంచి రూ.669 కోట్ల మేర ఆర్డర్లు వచ్చాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709