365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం, అక్టోబర్ 28, 2025: ఖమ్మం జిల్లా, ఎరుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్లలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం శంకుస్థాపన చేశారు.

రూ. 3.14 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ 33/11 కేవీ (KV) సబ్‌స్టేషన్ నిర్మాణంతో ఆ ప్రాంత రైతులకు, గృహ అవసరాలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు.

అనంతరం, ఆయన రేమిడిచర్లలోని మురికినీటి సమస్యను స్వయంగా పరిశీలించారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే దానికి శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను భట్టి విక్రమార్క గట్టిగా ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎన్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, ఆర్&బి, ఎంపీడీసీఎల్ విద్యుత్ అధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.