365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, శ్రీశైలం, మార్చి 23, 2023: దేవాదాయ, అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో శ్రీశైలం దేవస్థానం భూములకు సరిహద్దులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం,దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. గురువారం డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు సెక్రటేరియట్ 3వ బ్లాక్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీశైలం ఆలయ భూములకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ఆనంతరం డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ “చాలా కాలంగా కొనసాగుతున్న శ్రీశైలం భూ వివాదం ఒక పరిష్కారానికి వచ్చిందన్నారు.
“శ్రీశైల దేవస్థానం కు చెందిన 4500 ఎకరాల భూమికి స్కెచ్ లతో సహా సరిహద్దులు నిర్ణయించటం జరిగిందని, అటవీ, దేవాదాయ, రెవెన్యూ శాఖలు ఎంవోయూ కుదుర్చుకున్నామనిచెప్పారు.
శ్రీశైల క్షేత్రం శిఖరం,సాక్షి గణపతి, హఠకేశ్వరం, ముఖ ద్వారం వద్ద అభివృద్ది చేయాలని నిర్ణయాలు తీసుకున్నామని, పనులకు అవసరమైన 4500ఎకరాల అటవీభూముల సేకరణకు కేంద్ర అటవీ శాఖ కు ప్రతిపాదనలు పంపించామని మంత్రి పేర్కొన్నారు.
శ్రీశైల దేవస్థానం, దేవాదాయశాఖ చరిత్రలో ఈరోజు నుంచి సువర్ణాధ్యాయం మొదలైందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో రెండవ ప్రధాన ఆలయం శ్రీశైలం క్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదేశించారని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.