365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్1,2024 : బంగాళా ఖాతం లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) సిఎండి, 16 సర్కిళ్ల ఎస్ఈలు, 40 మంది డిఈలతో మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా, వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా లో ఎక్కడా అంతరాయాలు లేకుండా చూసుకోవాలని ఎస్ఈలను ఆయన ఆదేశించారు. నీట మునిగిన సబ్ స్టేషన్‌ల వివరాలు తెలుసుకొని, ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ విపత్తుల్లో ముందుగా ప్రభావితమయ్యే శాఖ కనుక, సిబ్బంది అందరూ 24/7 అందుబాటులో ఉండి, విద్యుత్ సరఫరా లేని చోట పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితుల్లో, చెట్లు విరిగిపడి విద్యుత్ స్తంభాలు, ఇన్సులేటర్లు దెబ్బతిన్న చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట, పునరుద్ధరణకు కలెక్టర్, పోలీసు, రెవెన్యూ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నీరులో మునిగిన సబ్ స్టేషన్లు, పిడుగులు పడి దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. 24/7 అలర్ట్‌గా ఉండి కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయి లో అధికారులు అమలు చేయాలని స్పష్టం చేశారు.
విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి అన్ని ఆవశ్యక మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ఎస్ఈలతో ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని, ఏ క్షణమైనా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
వరద ఉధృతి..
భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకల ఉధృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్‌గానే ఉందని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలమైన పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే ప్రజలు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
సిబ్బంది అర్థరాత్రి లను సైతం లెక్కచేయకుండా, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమిస్తున్నందుకు ఉప ముఖ్యమంత్రి సిబ్బందిని ప్రశంసించారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.