365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మోపిదేవి (కృష్ణా జిల్లా),అక్టోబర్ 30,2025: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోంథా తుపాను (Cyclone Montha) కారణంగా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన ముగించుకుని, తిరుగు ప్రయాణంలో మోపిదేవిలో వెలసిన ప్రసిద్ధ శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
మధ్యాహ్న సేవలో పవన్ కళ్యాణ్..
తొలిసారిగా ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్‌కు ఆలయ వేద పండితులు సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి, ఆలయ ఆవరణలో ఉన్న నాగ పుట్ట వద్దకు చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, పడగలకు మొక్కి, పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి తన మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ప్రదక్షిణగా వచ్చి అంతరాలయంలోని వేయి పడగలతో లింగమూర్తిగా వెలసిన మూలవిరాట్టుకి పంచామృతాలతో అభిషేకాదులు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు సమర్పించారు.
ఆలయ విశిష్టతను తెలుసుకున్న జనసేనాని..
పూజల అనంతరం ఘనాపాటి శ్రీ నవుడూరి విశ్వనాథ శర్మ ఆలయ విశిష్టతను, చరిత్రను పవన్ కళ్యాణ్‌కు వివరించారు. శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి స్వయంభువుగా వెలసిన క్షేత్రమని, పుట్టలో పోసిన పాలను లింగాకార మూర్తి కింద సర్పరూపంలో ఉన్న స్వామి వారు స్వీకరిస్తారని తెలిపారు.
శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి వారు స్వయంభువుగా వెలసిన క్షేత్రం అని, ఆలయం వెలుపల పుట్టలో పోసిన పాలను లింగాకార మూర్తి కింద సర్పరూపంలో ఉన్న స్వామి వారు స్వీకరిస్తారని తెలిపారు. సంవత్సరానికి రెండు, మూడు సార్లు స్వామి వారు వెలుపలికి వచ్చి భక్తులకు విశ్వరూప దర్శనమిస్తారని వివరించారు.
భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా పేరున్న మోపిదేవి క్షేత్రానికి వారాంతాలు, ప్రతి మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని చెప్పారు. నివార్ తుపాను సమయంలో రైతులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఆలయం వెలుపలి నుంచి వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

తమిళనాట ఉన్న ఆరు విఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం తర్వాత మోపిదేవి సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం కలిగిందని అన్నారు.
దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
