హామీ ఇచ్చిన ఐ అండ్ పీఆర్ కమిషనర్..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 29, 2025: ఎప్పటికప్పుడు ప్ర‌జ‌ల‌కు వేగంగా స‌మాచారం అందించే ఆన్‌లైన్ న్యూస్ మీడియాకు (వెబ్‌సైట్‌, యాప్‌లు) ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల‌ని తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (టిడిఎంజెఏ) నాయకులు స్వామి ముద్దం, పోతు అశోక్, పసుపులేటి వెంకటేశ్వరరావు, దయ్యాల అశోక్ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పిఆర్) ప్రత్యేక కమిషనర్ ఎస్. హరీష్‌కు బుధవారం విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు, ఆన్‌లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు అందించాలని కోరుతూ వారు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో లేఖ అందించారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ఐ అండ్ పీఆర్ కమిషనర్, త్వరలోనే ఆన్‌లైన్ మీడియాకు (వెబ్‌సైట్‌, యాప్‌లు) ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తా మ‌న్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను కూడా త్వరలో రూపొందించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నేత స్వామి ముద్దం మాట్లాడుతూ.. “ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ముఖ్యమైన వారధిగా డిజిటల్ మీడియా పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు ప్రజలకు ఆవాసరమైన వార్తలను అందిస్తోంది. ఈ డిజిటల్ మీడియాలో అనేక మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు.

డిజిటల్ మీడియా జర్నలిస్టుల‌కు గుర్తింపు ఇస్తూ, ఆన్‌లైన్ న్యూస్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని కమిషనర్ ఎస్.హరీష్‌ హామీ ఇచ్చారు.” అని ఆయన తెలిపారు.తదుపరి, ఆన్‌లైన్ న్యూస్ మీడియాకు తెలంగాణ మీడియా అకాడమీ అక్రిడిటేష‌న్లు ఇవ్వాల‌నే గైడ్‌లైన్స్‌ను రూపొందించడం ద్వారా జర్నలిస్టుల‌కు మేలు జరుగుతుంద‌ని” స్వామి ముద్దం పేర్కొన్నారు.