Fri. Nov 8th, 2024
Digital-App

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, జనవరి 28, 2023: భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా “టిటీదేవస్థానమ్స్” పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు.

ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసు కోవచ్చ న్నారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుంచి అందించవచ్చని చెప్పారు.

Digital-App

పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ఈ యాప్‌ ద్వారా చూడవచ్చని తెలిపారు.

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉందని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగ పడుతుందని చెప్పారు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు.

సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజిని ఉపయోగిస్తున్నామని తెలిపారు.

తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్‌ సేవలపై భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని పొందుపరుస్తామని చెప్పారు.

భక్తులకు సంబంధించిన అన్ని అవసరాల కోసం డిజిటల్‌ గేట్‌ వేగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి అన్నారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు ఓటిపి ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని చెప్పారు.

కంప్యూటర్‌ వాడడం తెలియనివారు కూడా వినియోగించేందుకు వీలుగా ఈ ప్రపంచస్థాయి యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.

error: Content is protected !!