365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 8, 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి
కెటిఆర్ పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో రూ.14.88 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.750 కోట్ల వడ్డీలేని రుణాల పంపిణీని ప్రారంభించారు. అభయ హస్తం నిధులను వడ్డీతో సహా తిరిగి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 21లక్షల 32వేల 482 మంది సభ్యులకు 545 కోట్ల 93 లక్షల రూపాయలు పంపిణీ ప్రారంభమైంది.
అలాగే, పాలకుర్తి నియోజకవర్గంలో 4 వేల 342 మహిళా సంఘాలకు రూ.204 కోట్లు పంపిణీ చేశారు. స్త్రీ నిధి ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలో 2వేల 46 మహిళా సంఘాలకు రూ.5069 లక్షలు పంపిణీ చేశారు.
కుట్టు శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న 3వేల మంది మహిళలకు 500 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
ఇంకా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో కెటిఆర్ చేతులు మీదుగా…
-రూ. 4 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ యార్డుకు ప్రారంభోత్సవం
-రూ. 2.13 కోట్లతో ఏర్పాటు చేసిన యతిరాజరావు పిల్లల పార్క్ కు ప్రారంభోత్సవం
-రూ. 3.75 కోట్లతో ఏర్పాటు చేయనున్న డివైడర్లకు శంకుస్థాపన
-రూ.5.00 కోట్లతో ఇండోర్ స్టేడియంకు శంకుస్థాపనలు జరిగాయి.
ఒకే రోజు పాలకుర్తి నియోజకవర్గంలో రూ.270 కోట్ల 70 లక్షల పంపిణీ జరగగా, రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాల్సిన రూ.1550 కోట్ల 62 లక్షల రూపాయల పంపిణీ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు దేశంలోనే అత్యుత్తమ మంత్రి. ఈ మాట నేను చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వమే అనేక సార్లు ప్రకటించింది. ఆయన నిర్వహిస్తున్న శాఖలకు అనేక అవార్డులు ఇచ్చింది.
దేశంలో 20 గ్రామ పంచాయతీలకు అవార్డలు ఇస్తే 19 తెలంగాణ పల్లెలే. నిన్న మొన్న స్టార్ 3, స్టార్ 4 లోనూ మొదటి మూడు జిల్లాలు మనవే ఉన్నాయి. సిఎం కెసిఆర్ గారి ముందు చూపు వల్ల, పల్లె ప్రగతి పథకం వల్ల, మంత్రి ఎర్రబెల్లి, ఆయన టీం చేస్తున్న కృషి వల్ల ఇవ్వాళ గ్రామాలు అత్యంత గొప్పగా ఎదిగాయి.
దేశానికే ఆదర్శంగా నిలిచాయి. గ్రామ గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, మొక్కలు పెంపకం, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కల్లాలు, వైకుంఠ ధామాలు… ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పనులు జరుగుతున్నాయి. అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పట్టు బట్టి నన్ను రప్పించారు. వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. గౌరవ సీఎం గారి తరపున ఇవాళ 1550 కోట్ల రూపాయలు నిధులు మహిళలకు ఇస్తున్నారు. దేశంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు దేశంలోనే అత్యుత్తమ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.
నేను చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వమే పదేపదే ప్రకటిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వరసగా ఏ ర్యాంకు లు ఇచ్చినా అవి తెలంగాణ కే వస్తున్నాయి. సీఎం కెసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అద్భుతంగా పని చేస్తున్నది.
అందుకే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. మేము చెప్పేది తప్పు అయితే, ఇంతకుముందు ఈ అవార్డులు ఎందుకు రాలేదు? ఈ అవార్డులు ఊరికే వస్తున్నాయా? అని కెటిఆర్ ప్రశ్నించారు.
పల్లెల గురించి తెలిసిన సీఎం గారు వస్తె ఎలా ఉంటుందో తెలుస్తున్నది. ఎర్రటి ఎండల్లో కూడా చల్లటి నీరు పారుతున్నది నిజం కాదా? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదా? కరెంట్ గతంలో ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లున్నది? ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త..
ఇవ్వాళ కరెంటు పోతే వార్త. తెలంగాణ రాక ముందు.. ఎలా ఉండే? 75 ఏళ్ళ లో ఎవరికి రాని సోయి… రైతులకు ఎదురు పెట్టుబడి వస్తున్నది. రైతు కుటుంబానికి బీమా ఇవ్వాలన్న సోయి ఎవరికైనా వచ్చిందా? అది చేసిన సీఎం కెసిఆర్ కాదా? రైతు కుటుంబానికి దిమా నిచ్చిన బీమా రైతు బీమా. ఇంత వేగంగా పనులు, పథకాలు అమలు అయ్యాయి. అని కెటిఆర్ వివరించారు.
K అంటే కాలువలు, C అంటే చెరువులు R అంటే రిజర్వాయర్లు…రైతుకు వెన్ను దన్నుగా నిలిచింది సీఎం కెసిఆర్ గారు. ఈ రోజు ఇన్ని పనులు జరిగాయి. ఇంకా అభివృద్ధి కాంక్షతోనే ఎర్రబెల్లి ఉన్నారు. ఆయన అడుగుతున్నారు కాబట్టి తొర్రూరు కు 25 కోట్లు మంజూరు చేస్తున్నాను అని కెటిఆర్ హామీ ఇచ్చారు.
పాలకుర్తి నియోజకవర్గ నేతన్నలు పొట్ట చేత పట్టుకుని బీవండి, సూరత్, బొంబాయిలకు పోతున్నారు. వారిని ఆదుకోవాలని ఎర్రబెల్లి అడిగారు. ఆయన అడిగిందే తడవు… కొడకండ్ల లో మినీ టెక్స్ట్ టైల్ పార్క్ కు 20 ఎకరాల స్థలం కేటాయిస్తూ, ఇప్పుడే జీవోను ఇదే వేదిక మీద నుండి అందిస్తున్నాను. అని కెటిఆర్ చెప్పారు.
సీఎం గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడిగి, తొర్రూరు కు 100 పడకల, పాలకుర్తి కి 50 పడకల హాస్పిటల్ ఇస్తాం. 10 వేల మందికి కుట్టు మిషన్లు ఎవరైనా అడిగారా? ధర్నాలు చేశారా? మరి దయాకర్ రావు ఎందుకు ఈ అభివృద్ధి చేస్తున్నారు.
కుట్టు మిషన్లు ఎందుకు ఇస్తున్నారు. ఇలా ప్రజల కోసం పని చేసే ఎమ్మెల్యేలు దొరకడం అదృష్టం. దయాకర్ రావు గారి ని కడుపులో పెట్టుకోవాలి అని పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు కెటిఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో ప్రజలకు ఏమి చేశామో, గంటల కొద్దీ చెప్పే దమ్ము మాకు ఉంది. మరి మీరు మీ రాష్ట్రాల్లో ఏమి చేశారు? చెప్పాలి. జన దన్ ఖాతాల్లో డబ్బులు పడ్డయా? ఆ ఖాతాల్లో దన్ దన్ డబ్బులు పడ్డాయా? కానీ ఆ డబ్బులు మాత్రం కొందరు వ్యక్తుల ఖాతాల్లో కి పోయాయి. మోడీ ఒక దేశం…
ఒక దోస్తు అనే కొత్త నియుమం పెట్టుకున్నాడు. డబుల్ ఇంజన్, రైతుల ఆదాయం డబుల్ అన్నాడు అయిందా? కానీ, ఆయన దోస్తు ఆస్తులు డబుల్ చబల్ అయ్యాయి. అని బిజెపి పాలనను కెటిఆర్ దుయ్యబట్టారు.
కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? మత విద్వేషాలు, విషాలు చిమ్మి ప్రజలను విడగొట్టి, రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చి, కుట్ర పూరితంగా పరిపాలన చేస్తున్నారు. ఈ మోడీ ప్రియమైన ప్రధాన మంత్రి కాదు పిరమైన్ ప్రధాన మంత్రి అని కెటిఆర్ చమత్కరించారు.
ఇవ్వాళ తెలంగాణలో బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి, చనిపోయాక కూడా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ఆయా పథకాలను ఒక్కొక్కటి చెబుతూ, ఇంత పెద్ద ఎత్తున చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా?
అందరికి, అన్ని వర్గాలకు వారికి ఏదో ఒక న్యాయం జరిగింది అని అందుకే సీఎం కెసిఆర్ గారిని ప్రజలు కడుపులో పెట్టుకుని చూసుకోవాలి. ఆయనకు అండగా నిలవాలి. అని కెటిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అభినందనలు! ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గం లోని తొర్రూరుకు పండుగ రోజు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు మన కోసం ప్రత్యేకంగా వచ్చారు.
సిఎం కెసిఆర్ గారి లాగే కెటిఆర్ గారు కూడా మహిళలకు, మనందరికీ ఆత్మ బంధువు. యూత్ కే కాదు మీలాంటి, మాలాంటి ఎందరికో… కెటిఆర్ గారు స్ఫూర్తి. అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
కొడకండ్ల లో టెక్స్ టైల్ పార్క్- ఉపాధి అవకాశాలు..
మన నియోజకవర్గంలోని కొడకండ్లకు కూడా మినీ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు అంగీకరించారు. వారి చేతుల మీదుగా త్వరలోనే కొడకండ్ల మినీ టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన జరుగుతుంది. కొడకండ్లలో, చుట్టు ముట్టు ప్రాంతాలకు చేనేత వృత్తిపై ఆధారపడిన వందలాది మందికి ఉపాధి దొరుతుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
కెటిఆర్ గారి చొరవతో తొర్రూరు అభివృద్ధి..
కెటిఆర్ గారి చొరవతో 125 కోట్ల రూపాయలతో తొర్రూరును అభివృద్ధి చేసుకుంటున్నాం. 36 కోట్లతో 676 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మంచుకుంటున్నాం.ఇంత పెద్ద ఎత్తున పనులతో తొర్రూరును సర్వాంగ సుందరంగా చేసుకుంటున్నాం.
తొర్రూరును అభివృద్ధి చేసిన ఘనత మన BRS పార్టీది. మన సీఎం కెసిఆర్ గారిది.. మన మంత్రి యువనేత కేటీఆర్ గారిది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారికి జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
వడ్డీలేని రుణాలు..
మన సిఎం కెసిఆర్ గారు, మన మంత్రి కెటిఆర్ గారు మనసున్న మహరాజులు! మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప కానుక! ఇచ్చింది. రాష్ట్రంలోని 4 లక్షల 31 వేల మహిళా సంఘాలకు… 46 లక్షల 10వేల కుటుంబాలకు ఈ రుణాలు అందుతాయి.
గత 10 ఏండ్ల కంటే ఈ 8 ఏండ్లలో ఎంతో ఎక్కువ రుణాలు ఇచ్చింది కెసిఆర్ ప్రభుత్వమే. గత ప్రభుత్వాలు 10 ఏండ్ల పాలనలో 21 వేల 978 కోట్లు రుణాలు మాత్రమే ఇచ్చాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఇప్పటి వరకు వివిధ బ్యాంకుల ద్వారా 66 వేల 624 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించడం జరిగింది.సగటున ఒక్కొక్క సంఘానికి 6 లక్షల 12 వేల 425 బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది.
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3 లక్షల 85 వేల 82 సంఘాలకు 2 వేల 561 కోట్ల 77 లక్షలు విడుదల చేసింది. అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ఇంత పెద్ద ఎత్తున నిధులను డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రాష్ట్రం దేశంలో లేదు. *దేశంలో ఎక్కడా లేని విధంగా.. మన రాష్ట్రంలో కుట్టు శిక్షణ చేపట్టిన0. పైలట్ ప్రాజెక్టుగా మన పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి విడతగా 5 కోట్ల 10 లక్షల రూపాయల ఖర్చుతో 3వేల మందికి శిక్షణ ఇస్తున్నాం.
శిక్షణ పూర్తి చేసుకున్న 500 మందికి కెటిఆర్ గారి చేతుల మీదుగా కుట్టు మిషన్లు అందుకున్నం. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తారిస్తం. ఇంకా 10వేల మంది పాలకుర్తి నియోజకవర్గ మహిళలకు శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణ తర్వాత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. నన్ను గెలిపించిన మీ రుణం తీర్చుకుంటాను అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
ఇక్కడకు వచ్చిన మహిళలు ఒకసారి ఆలోచన చేసుకోవాలే ఇండ్లళ్ళకు పోయి… మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా చర్చించాలె. ఇంత గొప్ప ప్రభుత్వాన్ని, సీఎం గారిని మీరు చూశారా? నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎందరో సీఎంలను చూసిన, ప్రభుత్వాలను చూసిన. కానీ, సిఎం కెసిఆర్ లాంటి సీఎంను చూడలే… మంత్రి కెటిఆర్ లాంటి గొప్ప మనిషిని చూడలేదు అందుకే మనమంతా సిఎం కెసిఆర్ కుటుంబానికి, మంత్రి కెటిఆర్ గారికి అండగా ఉండాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్ళపల్లి రవిందర్‌రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి,
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగూర్ల వెంకన్న, సతీశ్ రెడ్డి, జెడ్పీచైర్మన్లు పాగాల సంపత్ రెడ్డి, సుధీర్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు