Fri. Dec 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 20,2024: ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారు, సర్వే బృందాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి త్రిపాఠి సూచించారు.

ఈ నెల 31 వరకు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే జరగనున్నందున, సర్వే సమయంలో ప్రతి దరఖాస్తుదారు సర్వే బృందాలకు అందుబాటులో ఉండి, వారి ఫోటోతో పాటు ఇంటి సంబంధిత డాక్యుమెంట్లు, ఇతర వివరాలను సమర్పించాలని కోరారు.

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై శుక్రవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సర్వే సందర్భంగా ఎవరైనా దరఖాస్తుదారు వేరే ప్రాంతానికి వలస వెళ్లినట్లయితే వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలియజేసి, అందుకు సంబంధించిన రుజువును సర్వే బృందాలు వారి దగ్గర ఉంచుకోవాలని తెలిపారు.

ఈ నెల 31 నాటికి సర్వే పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి, దరఖాస్తుదారులు సర్వే బృందాలకు సహకరించి వారి పూర్తి వివరాలు,ఫోటోలు సమర్పించాలని ఆదేశించారు.

సర్వే చేసే పంచాయతీ కార్యదర్శులు,ఇతర అధికార బృందాలు దరఖాస్తుదారుని ఇంటి ముందుకు తీసుకువెళ్ళి ఒక ఫోటో, ఇల్లు రూఫ్ కనిపించే విధంగా మరో ఫోటో, ఇంటి లోపల భాగాన్ని చూపించే ఫోటో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు.

సర్వే వివరాలు నమోదు చేసే ఉద్యోగులు ప్రతి అంశంపై అవగాహనతో నింపాలని, త్వరపడకుండా సబ్మిట్ చేయకుండా, సాంకేతిక సమస్యలు ఎదురైతే నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్లికేషన్లు సమర్పించాలని చెప్పారు.

దేవరకొండ, మిర్యాలగూడ, చండూరు తదితర డివిజన్లలో పెండింగ్ ఎక్కువగా ఉన్న మండలాలు,గ్రామాల సర్వేను వేగవంతం చేయాలని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వేకు వచ్చే విషయాన్ని గ్రామాలలో మరోసారి టామ్ టామ్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని, అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో అవగాహన కల్పించాలని సూచించారు.

సర్వే పూర్తి అయ్యే వరకు గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ముందస్తు అనుమతితో సెలవు మంజూరు చేయాలని చెప్పారు.

ఈ టెలి కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, గృహ నిర్మాణ పి. డి. రాజ్ కుమార్,ఇతరులు మాట్లాడారు.

error: Content is protected !!