365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 18,2022: కొత్త సచివాలయ నిర్మాణాన్ని నాణ్యతలో రాజీ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కొత్త సచివాలయంలో అన్ని శాఖల పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు.
బుధవారం సాయంత్రం కొత్త సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. డిజైన్ ప్రకారం జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలో పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్.
ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో జాప్యం జరగకూడదని కోరారు. భవనంపై స్లాబ్‌లు, గోపురాలు, ఇంటీరియర్ పనులు, ఫర్నీచర్ నిర్మాణం కోసం కొత్త మోడల్‌లను ఎంపిక చేయాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరాల నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయంతోపాటు భవనం మధ్యలో రెండు ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ల్యాండ్‌స్కేపింగ్‌ను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గ్రిల్ పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పనులను కూడా కేసీఆర్ పరిశీలించారు. సచివాలయ గోడ వెంబడి విజిటర్స్ లాంజ్, మట్టి నింపే పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయానికి వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
జిల్లాల నుంచి కొత్త సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సౌకర్యార్థం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వారికి సూచించారు. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, సిబ్బంది సౌకర్యవంతంగా పనిచేసేలా చాంబర్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించిన ఆల్బమ్‌ను పరిశీలించి, ప్రతి పనిని వివరంగా అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.