365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 16,2022: తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని లక్షల సంఖ్యలో పాటలు వచ్చి ఉంటాయి. అటువంటి వాటిలో చిత్రసీమలో సంగీత ప్రపంచాన్ని ఏలిన పాటలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ పాటల వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉంటుంది. ఒక్క పాట పురుడుపోసుకోవడానికి వెనుక ఎంతో కష్టం ఉంటుంది. రచయిత దగ్గర నుంచి మ్యూజిక్ కంపోజర్, గాయకుడు, వరకూ అందరి కృషితోనే ఆ పాట సంగీత ప్రపంచంలో పున్నమి పూలతోటగా మారుతుంది. “సినీ పాటల పల్లకీ ” పాట వెనుక మాట..” ద్వారా పాటలతోటలో విరభూసిన పాటలను గురించి తెలుసుకుందాం.. ఈ ఎపిసోడ్ లో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి నటించిన “జయభేరి” చిత్రంలోని ఆ పాటలు ఎలా రూపొందించారో ఇప్పుడు తెలుసుకుందాం..
పి.పుల్లయ్య అవి జయభేరి1959 చిత్రం తీస్తున్న రోజులు – చిత్ర కథానుసారం నాయకుడు కాశీనాథశాస్త్రి రాజనర్తకి అమృతాంబవలలో పడి తాగుడు అలవాటులో పడాలి.. దానికి తగ్గట్టు ఓ పాట కూడా రాయించుకున్నారు. సాహిత్యం మల్లాది కవిశేఖరులు .. సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు. గానం ఘంటసాల మాస్టారు “నీదాన నన్నదిరా -నిన్నే నమ్మిన చిన్నదిరా తానే మధుకలశమని -మనసే నందనమని మువ్వలతో నవ్వులతో – మోమాటముగా కులికి చుక్కల కన్న తానే -చక్కని దాననన్నదిరా చక్కని జాబిలి యని- పక్కన జేరి పులకరించి”అంటూ తాగుడు మైకములో పాడినట్టు వెక్కిళ్లతో చుక్క , చుక్క అంటూ అటు తాను తాగుతున్న మధువు ని ఉద్ధేశిస్తూ , నర్తకి అందాన్ని అందాల చుక్క అన్న ఉద్ధేశ్యముతో ఉన్నట్టు పాడిస్తారు పెండ్యాల వారు ఘంటసాల మాస్టారు గారి చేత . ఆ విరుపులు మెరుపులు ఆ కాలం ఔచిత్యం చెడకుండా సన్నివేశాన్ని రక్తి కట్టించడం ఆతరం వారికే తెలుసు. ఆ చిత్రం పూర్తయ్యింది.
అవి మధ్యనిషేధం మహా క్రమశిక్షణతో అమలు జేస్తున్న రోజులు .. ఇంకేముంది చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు వారు ఆ పాటను తాగే సన్నివేశాలను తొలగించేశారు.ఇపుడు అయితే తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఒక స్లైడ్ వేయమని చెప్పేవారేమో. నిర్మాత దర్శకులు ఏమీ అడ్డు చెప్పలేదు.. సన్నివేశాలకు తగ్గట్టు కొన్ని దృశ్యాలు మళ్ళీ చిత్రీకరించుకుని విడుదల చేసారు. జయభేరి ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సాలలో విజయభేరి మ్రోగించింది. తమిళములో డబ్ చేశారో లేదా ఒకేసారి చిత్రీకరించారో తెలియదు గానీ తమిళములో కూడా కలై వానన్ గా విజయం సాధించింది. రాష్ట్రపతి యోగ్యతా పత్రం అందుకున్న చిత్రం ఇది , దీనికి మాతృక శాంతారాం మరాఠీ , హిందీలలో తీసిన మత్ వాలా శాయర్ రామ్ జోషి .
ఈ చిత్రములో నాయిక మంజువాణి నాట్యములో మొదటగా వచ్చే సవాల్ విసిరే పాట ” ఉన్నారా జోడున్నారా ” అనే పాటను జానపద బాణీలో కొసరాజు గారు రాసారు. నాయకుడు కాశీనాథ శాస్త్రి పండితుడు కాబట్టి వాటికీ సమాధానాలు . పై సవాల్ విసరడం మీరే రాయాలి అంటూ మల్లాది వారిని ఒప్పించి మెప్పించి మిగతా పాటను పూర్తీ చేయించడం ఆ రోజుల్లో కవుల మధ్య ఉన్న అవగాహన గౌరవ ప్రపత్తులు ఎంతగా ఉండేవో తెలుస్తుంది.
ఈ చిత్రంలో మొదట అంతుపట్టని విషయం ఒకటి తాగుడు మరగిన నాయకునికి ముందు నీదాన నన్నదిరా పాట..ఈ పాట ఘంటసాల గారు పాడతారు. త్రాగుడు వల్ల గొంతు పాడయింది. అన్నదానికి నిదర్శనంగా తరువాత వేరే గాయకుని చేత పాట పాడిస్తారు. అదే నాయకుడు పతాక సన్నివేశములో శివాలయములోనికి రానివ్వని భక్తుని కోసం ఆవేశముతో ” నందుని చరితము వినుమా ” అని ఆలపిస్తాడు .అంటే గాయకుడైన నాయకునికి తన గాత్రం వచ్చేసిందన్నమాట. అపుడు ఘంటసాల గారి గాత్రం. ఔచిత్య భంగం కలగకుండా చిత్రాలు తీసే రోజులు అవి మరి. అలా తీయాలి అంటే ఎంత సమిష్టి కృషి అవసరమో. ఉచితానుచితాలు తెలిసి ఔచిత్య భంగం కలుగనివ్వని రోజులు. విలువలకు వలువలు కట్టిన రోజులు మరి .. అందుకే ఆ చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి.
చివరి వరకు దర్శకుడు అనుకున్నట్టే అంతా తీశారు గానీ “రసికరాజ తగువారము కామా ” పాట పాడాక ఘంటసాల మాస్టారు గారి గాత్రం బాగా దెబ్బతిన్నది. ఇంక చివరి పాట క్లైమాక్స్ లో వచ్చేది. కథానాయకునికి తల్లిలాంటి వదిన పాత్ర చనిపోతే బ్రతికించమని వేడుకుంటూ ” దైవం నీవేనా ధర్మం నీవేనా ” అంటూ పాడే పాట. ఆ పాటను తమిళ గాయకుడు సౌందర్య రాజన్ పాడారు. నాయకుని గాత్రం బాగుపడ్డాక మళ్ళీ సౌందర్య రాజన్ చేత పాడించడం ఏమిటీ అంటూ ఫిలిం రివ్యూయర్స్ నోరు నొక్కున్నారట .. అక్కడ ఉన్న ముళ్ళపూడి రమణగారు ” ఓహో సౌందర్య రాజన్ పాడితే గానీ దైవం అదిరిపడి కరుణించడనా ” అని ఆ పక్కనే ఉన్న ఆ పాట రచయిత నారపరెడ్డి గారితో అనగానే ఆ పక్కనే ఉన్న ముక్కోపి అయిన దర్శకుడు పుల్లయ్య గారు కూడా కిసుక్కున నవ్వేరట. మహాకవి రచన!! మహా సంగీతదర్శకుని స్వరకల్పన..!! మహా నటుని అభినయం..!! మా మంచి దర్శకుడు పుల్లయ్య గారి దర్శకత్వం
అధికులనీ, అధములనీ నరుని దృష్టిలోనే భేదాలు
శివుని దృష్టిలో అంతా సమానులే…ఏ..ఏ..!
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా
ఆ… పరమానందము గనుమా!
ఆదనూరులో, మాలవాడలో ..
పేదవాడుగా జనియించి
చిదంబరేశుని పదాంబుజములే
మదిలో నిలిపీ కొలిచేను.. “నందుని”
తనయజమానుని ఆనతి వేడెను
శివుని చూడగా మనసుపడీ
పొలాల సేద్యం ముగించిరమ్మని
గడువే విధించె యజమాని !!
యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి
పొలము పండించుటో ఎరుగక,
అలమటించు తన భక్తుని కార్యము
ఆ శివుడే నెరవేర్చే….
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున
చిదంబరం లో శివునిదర్శనం
చేయగరాదనె పూజారి !!
ఆశాభంగము నొందిన నందుడు
ఆ గుడి ముందే మూర్ఛిల్లే
అంతట శివుడే అతనిని బ్రోచి
పరంజ్యోతిగా వెలయించే…..!!
:మరో ఎపిసోడ్ లో మరొక పాటతో మళ్ళీ కలుద్దాం…