Tue. Dec 24th, 2024
Telangana Government Doctors Association

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 20,2022: తెలంగాణలోని వైద్యులపై పత్రికలలో వివిధ రకాల వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నాయని , ఒకవేళ ఆ వార్తలు నిజమైతే వాటిని ఖండిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ,రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ దీన్ దయాల్ , రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ రోజు కొన్ని పత్రికలలో వైద్యులకు జియో ట్యాగింగ్ పెట్టనున్నట్లు, జిపిఎస్ మిషిన్లు అమర్చనున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు తెలిపారని, వైద్యులు జంతువులు కాదని , వైద్య వృత్తి అత్యంత పవిత్రమైందని అటువంటి ఈ వృత్తిలో ఒకరో ఇద్దరో పొరపాట్లు చేస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని , అన్ని శాఖలలో అలాంటివారు ఉంటారని అంతేకానీ వైద్యులందరినీ ఒకే గాడిన కట్టడం సబబు కాదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య పథకాలు వివిధ రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అంటే అది వైద్య ఆరోగ్యశాఖలో పని చేసే వాటిని అమలు చేసే ప్రతి ఒక్కరి కృషి అని తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతి సూచనను, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారి దార్శనికతను విజన్ ప్రతి ఒక్క వైద్యుడు,ఆరోగ్య సిబ్బంది అమలు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్నిముందువరసలో నిలబెట్టడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Telangana Government Doctors Association

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో కొత్త కొత్త పథకాలు రావడం వల్ల తీవ్ర పనిభారం పెరిగిపోయింది అని మరియు కరోనాతో మరింత భారం పెరిగినా సరే వైద్యులు మరియు వైద్య ఆరోగ్యశాఖ అలుపెరుగని పోరాటాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. పవిత్రమైన వైద్య వృత్తి కట్టడికి ప్రయత్నాలు చేయడం సరికాదని, వైద్యుల సేవలు ఎక్కడైనా రోగికి అందేలా చూడాలని అన్నారు. 24 గంటల వైద్య సేవల కోసం మూడు షిఫ్టుల విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

డి.హెచ్ పరిధిలోని వైద్యులకు టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యులకు వాహన సౌకర్యం లేదని వాహన సౌకర్యం కల్పించాలని కోరారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేసే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం, వైద్యం చేసే వారికే హెల్త్ కార్డులు లేకపోవడం దారుణమని అన్నారు. వెంటనే వైద్యులకు మరియు ఆరోగ్య సిబ్బందికి హెల్త్ కార్డులు జారీ చేయాలని అన్నారు.

కరోనా కట్టడికి మొదటి డోసు రెండవ డోసు మూడో డోసు అంటూ నిరంతరం ఎంతో పని ఒత్తిడికి లోనై సరిపోను సిబ్బంది లేక నానా కష్టాలు పడుతుంటే మూలిగే నక్క పై తాటిపండు చందంలా ఆరోగ్య రంగంపై ఎంతోమంది అవాకులు చవాకులు పేల్చడం సరికాదని డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ,రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ దీన్ దయాల్ , రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. డాక్టర్లు ఎవరూ భగవంతుళ్ళు కాదని అక్కడక్కడ ఏవైనా పొరపాట్లు జరిగితే డాక్టర్లను బలి పశువులను చేయడం సరికాదని అన్నారు.కొన్నిచోట్ల డాక్టర్లను సస్పెండ్ చేయడం, ఆరోగ్య సిబ్బందికి మెమోలు జారీ చేయడం లాంటి సంఘటనలు చూస్తున్నామని అనవసరంగా మాపై అధిక ఒత్తిడి తీసుకురావద్దని ఈ సందర్భంగా కోరారు.

error: Content is protected !!