365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 24, 2021:కిమ్స్ ఆసుపత్రిలోని రెస్పిరేటరీ కేర్ ఫిజిషియన్లు ఉత్తరభారతదేశానికి చెందిన 12 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు. ఆ బాలుడు తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడంతో ఎక్మో థెరపీ కోసం అక్కడినుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోడానికి, చికిత్స అందించేందుకు కిమ్స్ వైద్యబృందమే హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఈ బాలుడిని వీనో-వీనస్ ఎక్మోపై 65 రోజుల పాటు ఉంచి లైఫ్ సపోర్ట్ అందించారు. ఇందులో భాగంగా అన్ని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో నిశితంగా పరిశీలించి, అదనపు పోషకాహారం అందించి, శారీరక వ్యాయామం ద్వారా అవయవాల పనితీరు మెరుగుపరిచి, ఎక్మోపై ఉంచి అత్యాధునికంగా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచారు.
చిన్నపిల్లలకు చికిత్స అందిచడంలో ప్రధాన సమస్య వారి శరీర సున్నితత్వం. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వాళ్లకు పలు అవయవాలు దెబ్బతినంటాయి, మందులు అధికంగా వాడటం వల్ల కండరాలు బలహీనపడతాయి. రక్తప్రవాహంలో పలు రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. గాలి వెళ్లే మార్గంలో సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చి.. వీటన్నింటికంటే మందులకు లొంగని న్యుమోనియా కూడా వస్తుంది. కొవిడ్ తీవ్రస్థాయిలో ఉండి, న్యుమోనియా వచ్చిన పిల్లలకు ఎక్మో బ్రిడ్జిపై ఇంత ఎక్కువకాలం చికిత్స చేయడం ఇదే మొదటిసారి. కొవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నపిల్లలకు చికిత్స చేసేటప్పుడు అత్యున్నత స్థాయి ఇంటెన్సివ్ కేర్ చికిత్స చేయగల సామర్థ్యం, రెస్పిరేటరీ, ట్రాన్స్‌ప్లాంట్ బృందాలు ఉండాలి. రెండు నెలలకు పైగా ఈ తరహా చికిత్స పొంది, ప్రాణాలు దక్కిన ఇంత చిన్నవయసు కేసు ఇప్పటివరకు దేశంలోనే ఇది మొదటిసారి.
“డాక్టర్ సందీప్ అత్తావర్, కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ ) ఆసుపత్రిలోని ట్రాన్స్‌ప్లాంట్ బృందం సామర్థ్యం అత్యుత్తమమైనది. వాళ్లు లక్ష్యంగా పెట్టుకుని, సాధించే అత్యున్నత నాణ్యత కలిగిన ఫలితాలలు ప్రతిసారీ వస్తూనే ఉంటాయి. ఇవి వాళ్ల నిబద్ధతకు, కిమ్స్ ఆసుపత్రిలోని అత్యున్నత స్థాయి సదుపాయాలకు నిదర్శనం” అని కిమ్స్ ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అభినయ్ బొల్లినేని అన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజీ విభాగం అధిపతి డాక్టర్ విజయ్ మాట్లాడుతూ, “ఈ బాలుడిని మా వద్దకు తీసుకొచ్చినప్పుడు అతడి ఊపిరితిత్తులు బాగా పాడయ్యాయి, గట్టిగా అయిపోయాయి. దాంతో అతడి శరీరానికి ఆక్సిజన్ అందడం లేదు. ఎక్మో సపోర్ట్ వల్ల అతడి ఊపిరితిత్తులకు విశ్రాంతి లభించింది. దాంతో వాటంతట అవే బాగుపడి, పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సంతరించుకుని మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. మా వద్ద దేశంలోనే అతిపెద్ద, అత్యంత అనుభవం ఉన్న ఎక్మో బృందాలు ఉన్నాయి. దాంతోపాటు అత్యంత నిబద్ధత కలిగిన వైద్యులు, ఇతర సిబ్బంది ఉన్నారు. వారు లేకపోతే ఇలాంటి అద్భుతంగా రోగులు కోలుకోవడం సాధ్యమే కాదు” అని చెప్పారు.
ఈ సందర్భంగా మిడ్‌లాండ్ హెల్త్‌కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన సీనియర్ పల్మనాలజిస్టు, ప్రైమరీ ఫిజిషియన్ డాక్టర్ బి.పి. సింగ్ మాట్లాడుతూ, “ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న మా మిడ్‌లాండ్ హెల్త్‌కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి కొవిడ్ న్యుమోనియా తీవ్రంగా ఉన్న ఈ బాలుడిని కిమ్స్ బృందం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ బాలుడు పూర్తిస్థాయిలో కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడని తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. లక్నోలోని మిడ్‌లాండ్ ఆసుపత్రి, హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందాలు సంయుక్తంగా చేసిన కృషి విజయవంతం కావడం నిజంగా అద్భుతమే” అన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన చీఫ్ ఇంటెన్సివిస్టు డాక్టర్ ప్రభాత్ దత్తా మాట్లాడుతూ, “ఈ బాలుడిని తీసుకొచ్చినప్పుడు వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు స్టెరాయిడ్స్ వాడటం, ఇమ్యునోమాడ్యులేటింగ్ థెరపీ చేయడం వల్ల మయోపతి కూడా వచ్చింది. దాంతో అతడికి దాదాపు రెండు నెలలకు పైగా తీవ్రంగా శ్రమించి ఎక్మోపై చికిత్స చేశాము. అతడు కోలుకోవడం మా అందరికీ ఎంతో సంతోషకరం. నర్సింగ్, ఫిజియోథెరపీ బృందం కూడా పూర్తిస్థాయిలో తమ సేవలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని చెప్పారు.
డాక్టర్ సందీప్ అత్తావర్ దేశంలోనే గుండె, ఊపిరితిత్తుల మార్పిడి సర్జన్లలో అత్యంత అనుభవం ఉన్నవారు. ఈ రంగంలో ఆయనకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ఆయన 12 వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు, 350 ఊపిరితిత్తుల మార్పిడి, గుండె మార్పిడి, కృత్రిమ గుండె అమరిక చికిత్సలు చేశారు. ఈ బాలుడికి చికిత్స చేయడంలో డాక్టర్ అత్తావర్‌కు పలువురు నిపుణులు, ఇతర సిబ్బంది బృందం కూడా సాయం అందించింది. వాళ్లంతా దాదాపు రెండు నెలలకు పైగా రోజంతా బాలుడిని కంటికి రెప్పలా కాపాడారు.