365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 4,2024: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం కారణంగా తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి. విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో కూడా భూమి కంపించింది, దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

ఎన్టీఆర్ జిల్లాలో కూడా భూకంపం ప్రకంపనలు సృష్టించాయి. విజయవాడతో పాటు, జగ్గయ్యపేటలో కూడా భూకంపం తీవ్ర భయాన్ని కలిగించింది. మరొక వైపు, తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూకంపం వచ్చింది.

కొద్ది సెకన్లపాటు భూమి కంపించడంతో అక్కడ ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా ఈ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

అలాగే, మణుగూరు సబ్ డివిజన్‌లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఉదయం 7:28 నిమిషాలకు ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది, దీంతో కుర్చీలో కూర్చున్న ప్రజలు కింద పడిపోయారు. కరీంనగర్‌లోని విద్యానగరంలో కూడా భూకంపం వచ్చింది.

అక్కడ నిలబడిన ప్రజలు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు. అదే విధంగా, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.