365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 14,2023: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసు రాజకీయ ప్రేరేపితమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె కవిత గురువారం అన్నారు.
ఆమె పలు కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడంతో పాటు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నది కాబట్టి కవిత శుక్రవారం ఈడీ ముందు హాజరు కాలేరని ఆమె న్యాయ బృందం ఈడీకి లేఖ పంపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత కొన్ని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను శుక్రవారం ఢిల్లీ కార్యాలయానికి పిలిపించిన సంగతి తెలిసిందే.
కవితను మార్చిలో ఈడీ ప్రధాన కార్యాలయంలో పలుమార్లు విచారించారు. విచారణ కోసం ఆమె మొబైల్ ఫోన్‌లను ఈడీకి సమర్పించాల్సి వచ్చింది.
నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో కవిత స్పందిస్తూ.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకోవడం బీజేపీ పద్దతి అని, తెలంగాణా ఎన్నికలకు వెళ్తున్నందున అదే టెక్నిక్‌ను ఉపయోగిస్తోందని కవిత అన్నారు.
“నాకు ఈడీ నుంచి నోటీసు అందింది. రాబోయే ఎన్నికలలో తెలంగాణలో నెలకొన్న వాతావరణం కారణంగా ఇది రాజకీయ ప్రేరేపిత నోటీసు అని మేము గట్టిగా నమ్ముతున్నా” అని ఆమె తెలిపారు.
కవిత ఈసందర్భంగా ఈడీ దర్యాప్తును “ఎప్పటికీ ముగియని టీవీ సీరియల్”తో పోల్చింది. “దురదృష్టవశాత్తు గత ఏడాది కాలంగా విచారణ జరుగుతోంది. ఇది ఎంతకాలం జరుగుతుందో నాకు తెలియదు. 2జీస్కామ్ కూడా ఇంత కాలం కొనసాగిందని నేను అనుకోను.
ఇది దురదృష్టకరం, కానీ ఇది రాజకీయంగా ప్రేరేపించబడింది, ”అని కవిత అన్నారు. బీఆర్‌ఎస్ ఏ రాజకీయ పార్టీకి చెందిన బీ టీమ్ కాదని, ఈ దేశ, తెలంగాణ ప్రజల ఏ టీమ్ అని, బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
ప్రధాన నిందితుల్లో ఒకరైన అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసు పంపింది.