365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,ఏప్రిల్ 21,2022: ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 8వ విడత బాలకాండ అఖండ పారాయణం శ్రవణానందంగా సాగింది.
ఇందులో 33 నుంచి 37 సర్గల వరకు గల 134 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితుల అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.
ఈ సందర్భంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య రామకృష్ణ సోమయాజులు మాట్లాడుతూ రామనామం పలికితే బాధలు తొలగి, సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. బాలకాండలోని శ్లోకాలను, విషూచికా మహమ్మారి నివారణ మంత్రమును ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు ఒకేసారి పారాయణం చేస్తే ఫలితం అనంతంగా ఉంటుందని వివరించారు.
రామానుజాచార్యులు, శ్రీ మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన బాలార్క బృందం త్యాగరాజ కీర్తన “ముచ్చట బ్రహ్మాదులకు…”, ముత్తుస్వామి దీక్షితులు రచించిన “స్వామినాథ పరిపాలయ…” కీర్తనలను ఆలపించారు.