365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 17,2023: అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, టెక్ రంగంలో ఉద్యోగ నష్టాల కారణంగా వినియోగదారులు ఖర్చును తగ్గించుకోవడంతో గత ఏడాది దీపావళి నుంచి భారతదేశంలో టీవీలు, మొబైల్ ఫోన్ కెమెరాలు, చిప్‌లు వంటి ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది.
మీరు టీవీ, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయబోతున్నారా..? అయితే, మీకో గుడ్ న్యూస్. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు త్వరలో తమ ఉత్పత్తుల ధరలను తగ్గించ నున్నాయి. వాస్తవానికి గత 12 నెలల నుంచి వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది.

అదే సమయంలో కోవిడ్ కాలంలో రికార్డు స్థాయికి చేరుకున్న సరుకు రవాణా ఖర్చు ఇప్పుడు దాదాపు 10 శాతానికి తగ్గింది. దీనితో పాటు, ఈ ఉత్పత్తులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ భాగాల ధరలు కూడా 60-80 శాతం తగ్గాయి. ఈ కారణంగానే కంపెనీలు డిమాండ్‌ని పెంచేందుకు ఈ పండుగ సీజన్‌లో వినియోగదారుల కోసం ధరలను తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి.
అందుకే డిమాండ్‌పై ప్రభావం..
అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు,టెక్ రంగంలో ఉద్యోగ నష్టాల కారణంగా వినియోగదారులు ఖర్చును తగ్గించుకోవడంతో గత ఏడాది దీపావళి నుంచి భారతదేశంలో టీవీలు, మొబైల్ ఫోన్ కెమెరాలు, చిప్‌లు వంటి ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించింది. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఏడాది ప్రాతిపదికన 16 శాతం క్షీణించగా, కంప్యూటర్ మార్కెట్ 30 శాతం తగ్గింది.
సరుకు రవాణా రూ.6.5 లక్షలకు గాను 70 వేల వరకు వచ్చింది. కోవిడ్ సమయంలో చైనా నుంచి కంటైనర్ల ద్వారా విడిభాగాల రవాణా ఖర్చు ఒక్కో కంటైనర్‌కు రూ.6.5 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు 70 వేల నుంచి 80 వేల రూపాయలకు తగ్గింది. అలాగే, సెమీకండక్టర్ చిప్‌లు ,కెమెరా మాడ్యూల్స్‌తో సహా అన్ని స్మార్ట్‌ఫోన్ కాంపోనెంట్‌ల ధరలు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయి.

అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మరియు సరుకుల ధరలు దాదాపు కోవిడ్‌కి ముందు ఉన్న స్థాయిలోనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, డిమాండ్ తగ్గడంతోపాటు కొన్ని దేశాలలో మాంద్యం కారణంగా ధరలు కూడా తగ్గాయి.
ఖర్చు తగ్గింపు కారణంగా ఎలక్ట్రానిక్స్ కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్లు కూడా పెరుగుతాయి. డిక్సన్ టెక్నాలజీస్, హావెల్స్ ,బ్లూ స్టార్ వంటి కంపెనీలు తమ చివరి త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఈ సంవత్సరం తమ మార్జిన్లు మెరుగుపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.