365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 4,2024:టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ X (మాజీగా ట్విట్టర్)లో 200 మిలియన్ల (20 కోట్లు) ఫాలోవర్లతో రికార్డు సృష్టించారు. 2022లో $44 బిలియన్లకు Xని కొనుగోలు చేసిన మస్క్, తన ఫాలోవర్ల సంఖ్యలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు.

ఫాలోవర్ల పరంగా, మస్క్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో వంటి ప్రముఖులు కూడా ఈ రేసులో వెనుకబడ్డారు. అక్టోబర్ 3 నాటికి ఒబామాకు 131.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, రొనాల్డోకు 113.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

కెనడా గాయకుడు జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. 108.4 మిలియన్ ఫాలోవర్లతో సింగర్ రిహానా ఐదో స్థానంలో నిలిచారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 102.4 మిలియన్ ఫాలోవర్లతో ఆరుగో స్థానంలో ఉన్నారు.

Xలో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది

మస్క్ ఇటీవలి నివేదిక ప్రకారం, Xలో ప్రతిరోజూ 300 మిలియన్ల యాక్టివ్ వినియోగదారులు ఉంటున్నారు. అయితే, మస్క్‌ ఫాలోవర్లలో లక్షలాది మంది నకిలీ ఖాతాదారులని, ఇన్‌యాక్టివ్ ఖాతాలు కూడా ఫాలోవర్లుగా కనిపిస్తున్నాయని కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి.

అమెరికాలో X వినియోగదారుల సంఖ్య గతంలో కంటే ఇప్పుడు భారీగా పెరిగిందని మస్క్ పేర్కొన్నారు. ఎలోన్ మస్క్‌ Xను ఒక సంపూర్ణ యాప్‌గా మార్చాలనే లక్ష్యంతో ఉన్నారు, దీని ద్వారా వ్యక్తులు సినిమాలు, టెలివిజన్ షోలను పోస్ట్ చేయడంతో పాటు డిజిటల్ చెల్లింపులు కూడా చేయగలుగుతారు.