365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 23, 2022: నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి (ఎల్బీనగర్) వైద్యులు ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ ఇంజినీరు కుడి చేతిని సంక్లిష్టమైన శస్త్రచికిత్సతో కాపాడారు. ఆ ఇంజినీరుకు వాస్క్యులర్ గాయం, కంపార్ట్‌మెంట్ సిండ్రోమ్ కూడా అయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయం కావడంతో అతడి ప్రాణాలను కాపాడేందుకు చెయ్యి తీసేయాల్సిన పరిస్థితిని వైద్యులు నివారించారు.
ఆస్పత్రికి వచ్చేసరికి బాధితుడి పరిస్థితి గురించి అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా సర్జన్ డాక్టర్ వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, “ఘోరమైన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అతడి చెయ్యి బాగా దెబ్బతింది. దాన్ని అలాగే వదిలేస్తే భవిష్యత్తులో మరింత ఇబ్బంది ఎదురయ్యేది. సాధారణంగా అయితే ఆ చేతిని పూర్తిగా తొలగించాలి. కానీ, బాధితుడి కుటుంబసభ్యులతో మాట్లాడి, వాళ్ల అనుమతి తీసుకున్న తర్వాత అత్యవసరంగా సంక్లిష్ట మోచేతి శస్త్రచికిత్స చేసి.. దాంతోపాటు వాస్క్యులర్ మరమ్మతులు కూడా చేశాం. ఈ శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతం అయ్యింది, ఎలాంటి ఇబ్బందులూ కలగలేదు. తొలుత తన వేళ్లను, తర్వాత మోచేతిని కూడా బాధితుడు కదిలించగలిగాడు” అని చెప్పారు.
హైదరాబాద్‌కు చెందిన ఈ 36 ఏళ్ల యువ ఇంజినీరు ఇప్పుడు తన విధులన్నింటినీ నిర్వర్తించగలుగుతున్నాడు. తన కుటుంబం మొత్తానికి అతడే సంపాదనపరుడు. ఒకవేళ చెయ్యి తీసేయాల్సి వస్తే, కేవలం బాధితుడికే కాక.. మొత్తం కుటుంబానికి చాలా ఇబ్బంది కలిగేది. ప్రమాదం జరిగిన తర్వాత ‘గోల్డెన్ అవర్’లోనే బాధితుడిని సరైన ఆస్పత్రికి తీసుకురావడం వల్లనే బాధితుడి చేతిని వైద్యులు కాపాడగలిగారు.
ప్రమాద బాధితులకు సాయంగా ఉండేవాళ్లకు ఈ సందర్భంగా అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి సీవోవో డాక్టర్ సత్వీందర్ సింగ్ సభర్వాల్ ఒక సలహా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ప్రమాద బాధితులను అన్ని ప్రత్యేక విభాగాలు ఉన్న ఆస్పత్రికి సరైన సమయంలో తీసుకురావడం చాలా ముఖ్యం. అలాంటి చోట అయితేనే బాధితుల పరిస్థితిని సరిగా అంచనా వేయగలరు, వీలైనంత త్వరగా సరైన చికిత్స అందించగలరు. ప్రమాదబాధితులను గోల్డోన్ అవర్ సమయంలోనే ఆస్పత్రికి తీసుకురాగలిగితే వాళ్ల ప్రాణాలు కాపాడగలం” అని చెప్పారు.