365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,మార్చి 14,2021: ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రయివేటు ఉద్యోగమైనా సరే కొన్ని కార్యక్రమాలు కొందరి చేతుల మీదుగానే జరుగుతుంటాయి. అవి ఆయా వ్యక్తులకు ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంటాయి. అటువంటి వారిని గురించి చెప్పుకోవాల్సి వస్తే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో కార్యనిర్వాహణాధికారిణిగా విధులు నిర్వహిస్తున్న అన్నపూర్ణ గురించి తప్పని సరిగా ప్రస్తావించాలి…ఎందుకంటే ఎన్నో ఏండ్ల నాటి దేవాలయాలకు ఆమె ఈవోగా ఉన్న సమయంలోనే ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటివరకు 32 ఆలయాలకు ఈవోగా పనిచేసిన అన్నపూర్ణ ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు… ప్రస్తుతం బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అన్నపూర్ణ 365తెలుగు డాట్ కామ్ తో ముచ్చటించారు.
అరుదైన ఘనత దక్కింది…
రెండు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం చేయించడం తన చేతుల మీద జరగడం నిజంగా తన అదృష్టమని అన్నపూర్ణ చెబుతున్నారు. అదే సంవత్సరం లష్కర్ బోనాలకు 35 లక్షల మంది భక్తులు రావడం కూడా సరికొత్త రికార్డే. కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు ప్రముఖులు, ఇతర నాయకులు, మహిళలు వెయ్యి బోనాలతో మొదలుపెట్టి పదిహేను వందల బోనాలు అమ్మవారికి సమర్పించారు.ఎన్నో ఉద్యోగాలున్నా .. తనకు ఇలాంటి ఉద్యోగం రావడం ఆమె తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే కారణమని అంటున్నారామె. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు దాతలు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కి బంగారు చీరె సమర్పించడం అన్నపూర్ణ ఈవోగా ఉన్నప్పుడు జరగడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
అండగా నిలిచి ఆదుకొని…
కరోనా నేపథ్యంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. అటువంటి వారికీ అండగా నిలిచి ఆదుకున్నారు అన్నపూర్ణ. అంతేకాదు అర్చకులు భగవంతుడికి పూజ చేసి, కానుకలు లేకుండా ఒట్టిచేతులతో ఇండ్లకు వెళ్లాల్సివచ్చింది. అలంటి సమయంలో వారికీ అన్నపూర్ణ ఆర్ధిక సాయం అందించారు. కోవిడ్ క్లిష్టపరిస్థితుల్లో పలుజాగ్రత్తలు పాటిస్తూ అన్నపూర్ణ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నపేదవారికి తనవంతుగా నిత్యావసరవస్తువులు, అన్నదాన కార్యక్రమాలు చేశారు.
తొలిసారి ఈవోగా…
ఈవోగా 2001లో అన్నపూర్ణ కు తొలిసారిగా సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్‌లో ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ బాధ్యతలిచ్చారు. అది నాలుగు వందల ఏండ్ల నాటి ప్రాచీన దేవాలయం. అప్పటిదాకా స్థానికులకు అక్కడ ఒక ఆలయం ఉన్నట్టు కూడా తెలిసేది కాదు. పూజారులు పూజ చేసి ఉదయం పది లోపు వెళ్లిపోయేవాళ్లు. భక్తులు ఆలయానికి వచ్చే సమయానికి అనుకూలంగా దర్శనం వేళలు మార్చారు. దీంతో భక్తుల రద్దీ పెరిగింది. అంతేకాదు ఆధ్యాత్మిక చింతన పెంచడానికి సహస్రనామాలు చదివే మహిళలతో అన్నపూర్ణ ప్రత్యేకంగా గ్రూప్ లు ఏర్పాటు చేశారు.
అన్నపూర్ణ పేరును సార్థకం చేసుకున్నది…
అన్నపూర్ణ తండ్రి జనార్ధనరావు నల్గొండ జిల్లా, తుంగతుర్తి మండలం, వెంపటి గ్రామంలో పటేల్. రోజుకు కనీసంగా వందమందికి పైగా పంచాయితీకి వచ్చేవారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టేది అన్నపూర్ణ తల్లి కౌసల్యాదేవి. అన్నపూర్ణ పేరుపెట్టినందుకు కాకపోయినా అన్నపూర్ణకు అన్నదానం చేసే అలవాటు మాత్రం వారసత్వంగా వచ్చిందనేచెప్పాలి. ఎంతోమంది అన్నార్తుల ఆకలి తీరుస్తూ వారిపాలిట అన్నపూర్ణగా ఆపేరును సార్థకం చేసుకుంటున్నారామె…