365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, వనపర్తి, డిసెంబర్ 27,2022: పాశ్యాత్య దేశాల్లో ఉన్నట్లు అందరికీ సమానహక్కులు, సమాన గౌరవం మన దేశంలోనూ రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఖిల్లాఘణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ గణిత దినోత్సవం గణిత సంబరాలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..సమాజంలో సులభంగా పనిచేసి సంపాదించే వారి పెత్తనం పెరిగింది. అది పోయి కష్టం చేసి సంపాదించే వారి మాట చెల్లుబాటు కావాలి.
ఆ పరిస్థితి రావాలి. శ్రమను సమానంగా గౌరవించే పరిస్థితి లేకపోవడంతో పాటు, లింగభేదాలతో మహిళలను చిన్నచూపు చూసే దుస్థితి ఉండడం దురదృష్టకరం’ మని ఆయన పేర్కొన్నారు.
అందరూ పనిచేయడాన్ని గౌరవంగా భావించాలని సూచించారు. దానిని ఇప్పటి నుంచే అందరూ అలవాటు చేసుకోవాలని,పని విలువ తెలిసినప్పుడే మనుషుల విలువ తెలుస్తుందని సూచించారు.
ప్రతి విద్యార్థి రోజు వారి ఇంటిపనులే కాకుండా వారంతంలో ఇతర పనులు చేయాలని వెల్లడించారు. కష్టం చేయడం ద్వారా సాధించిన ఆదాయం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు.
గతంలో ఆడబిడ్డలను ఉన్నత చదువులకు దూరంగా ఉంచేదని నేడు సమాజంలో ఆడబిడ్డలకు ప్రాతినిధ్యం పెరిగిందని తెలిపారు.
ఇతర గ్రామాల నుంచి చదువుకోవడానికి వస్తున్న ఘణపురం ఉన్నత పాఠశాల బాలికలకు సైకిళ్లు అందిస్తామని ఆయన తెలిపారు.