365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 3,2022: మహానటుడు ఎస్వీ రంగారావు చివరి రోజులు ఎలాగడిచాయో తెలుసుకుందాం.. తెలుగు చిత్రపరిశ్రమకు1974 జూలై 18వతేదీ నిజంగా దుర్దినం. విశ్వనట చక్రవర్తి రంగారావు గుండెపోటుతో కన్ను మూసిన రోజది.
ఆ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆయనకు తొలిసారిగా గుండెపోటు వచ్చింది. అప్పుడు రంగారావు హైదరాబాద్‌లోని బ్లూమూన్ హోటల్‌లో ఉన్నారు. నిర్మాత ఆదిశేషగిరిరావు అదే సమయంలో రంగారావును కలవడానికి వెళ్లారు. ‘గుండెల్లో నొప్పిగా ఉంది’ అని రంగారావు చెప్పడంతో ఆయన్ని ఉస్మానియా హాస్పిటల్‌లో చేర్పించారు ఆదిశేషగిరిరావు. చికిత్స పొందిన అనంతరం చెన్నై వచ్చేశారు.
నెల రోజుల పాటు షూటింగ్స్‌కి వెళ్లకుండా ఇంటికే పరిమిత మయ్యారు. ఆ సమయంలోనే ‘యశోదకృష్ణ’ చిత్రంలో నటించే అవకాశం రంగారావుకు వచ్చింది. అందులో కంసుని పాత్ర పోషించాలని ఆయన ముచ్చట పడ్డారు. డాక్టర్లు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చినా ఆయన వినిపించు కోలేదు.
‘నేను ఆరోగ్యంగానే ఉన్నానయ్యా.. నాకేం కాదు’అని వారికి చెప్పి మైసూరుకు వెళ్లి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు రంగారావుగారు. ఔట్‌డోర్ షూటింగ్ ఆయన ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసింది. అయినా ఇంటిపట్టున ఉండలేదు రంగారావు. షూటింగ్స్‌కు వెళుతూనే ఉన్నారు.
1974 జూలై 18వతేదీన ఆయనకు షూటింగ్ లేదు. ఇంట్లోనే ఉన్నారు. భోజనం చేసి కాసేపు పడుకొన్నారు. సాయంత్రం నాలుగున్నరకి లేచి బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చి డ్రస్ చేసుకొంటుండగా తూలి మంచం మీద పడ్డారు. అంతే. ఆయన మళ్లీ లేవలేదు. రంగారావు పర్సనల్ డాక్టర్ బాలకృష్ణకు కబురు వెళ్లింది. ఆయన వచ్చి చూస్తే నాడి అందలేదు.
ఎందుకైనా మంచిదని కె.జె.హాస్పిటల్ సూపరింటెండెంట్‌నీ, జనరల్ హాస్పిటల్ కార్డియాక్ స్పెషలిస్ట్‌ను పిలిపించారు. వారు వచ్చి ప్రాణం పోయిందని నిర్దారణ చేశారు. ట్రీట్‌మెంట్ ఇచ్చే అవకాశం లేకుండానే రంగారావు కన్నుమూయడం విషాదకరం. ఈ వార్త మెల్లిగా పరిశ్రమలోకి పాకింది.
ఆ సమయంలో రంగారావు ‘చక్రవాకం’, ‘కొత్త కాపురం’, ‘జమీందారుగారి అమ్మాయి’ చిత్రాల్లో నటిస్తున్నారు. రంగారావు మరణవార్త తెలియగానే ‘చక్రవాకం’ చిత్ర నిర్మాత రామానాయుడు, దర్శకుడు వి.మధుసూదన రావు రంగారావు ఇంటికి చేరుకొన్నారు. మేడ మీద గదిలో రంగారావు భౌతికకాయం ఉంది. అయితే మొదట్లో ఎవర్నీ అక్కడకు రంగారావు సతీమణి లీలావతి వెళ్లనివ్వలేదు. ఆవిడ గురువు ఒకరు పాండిచ్చేరిలో ఉంటారు.
ఆయన వచ్చి చూస్తే మనిషి మరణించి 24 గంటలైనా తిరిగి బతుకుతాడని లీలావతికి ఎవరో చెప్పారు. ఆ నమ్మకంతోనే భర్త శవం దగ్గరకు ఎవరినీ వెళ్లనివ్వలేదు, చూడనివ్వలేదు. అయితే తన గురువు ఫోన్‌లో దొరకకపోవడంతో చేసేదేమీ లేక మేడ మీద నుంచి భౌతికకాయాన్ని కిందకు తీసుకొచ్చి ఇంటి ముందున్న వసారాలో ఉంచడానికి అంగీకరించారు. పరిశ్రమలోని అందరికీ ఈ వార్త తెలియడంతో రంగారావు అంతిమ దర్శనం కోసం సినీజనం బారులు తీరారు.
శివాజీగణేశన్ ‘ఏరా’ అంటే ‘ఏరా’ అనుకొనేవారు..
రంగారావు, తమిళ నటుడు శివాజీగణేశన్ ‘ఏరా’ అంటే ‘ఏరా’ అనుకొనేవారు. రాత్రికి రంగారావు ఇంటికి వచ్చిన శివాజీగణేశన్ తన మిత్రుడి మృతదేహాన్ని చూసి ఏడుపు ఆపుకోలేకపోయారు. హీరోయిన్ వాణిశ్రీ పరిస్థితీ అంతే. అంతిమ యాత్ర మొదలయ్యేవరకూ ఆమె భౌతిక దేహం పక్కనే ఉన్నారు. చెన్నైలోని కన్నెమ్మపేట శ్మశానంలో రంగారావు అంత్యక్రియలు జరిగాయి. రంగారావు అంతిమ యాత్ర దృశ్యాలను ఛాయాగ్రాహకుడు దేవరాజ్ చిత్రీకరించారు.
ఆయన నటించిన చివరి చిత్రం ‘యశోదాకృష్ణ’ తో పాటు అంతిమయాత్ర దృశ్యాలను థియేటర్లలో ప్రదర్శించారు. అంతులేని అభిమాన ధనాన్ని సంపాదించుకొన్నా, దేశంలో తనకు రావాల్సిన గుర్తింపు రాలేదనే బాధ చివరివరకూ రంగారావులో ఉండేది. ‘పద్మశ్రీ’ ఇత్యాది పురస్కారాలు ఆయన వరకూ ఎందుకు రాలేదో ఎవరికీ అర్థం కాని విషయం.