365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 27,2024: వైకాపా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ఒకకాలంలో కీలక నేతగా పేరు గడించారు. మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు.

అయితే, అది ఒకప్పుడు. ప్రస్తుతం ఎవరికైనా అధికారమే ఆధారం. అది లేకపోతే, ఎంతటి నాయకుడైనా వెనకబడాల్సిందే. గత ఎన్నికల్లో వైకాపా అనేక కోటలు కూలిపోయాయి. ఆ కోటలలో బొత్స సత్యనారాయణ కోట కూడా ఒకటి. ఆయనకూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

తాజాగా ఉత్తరాంధ్ర రాజకీయాలను ఉర్రూతలూగించిన ఒక వార్త ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ గజపతినగరం ఎమ్మెల్యే, MSME, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వైకాపా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారని ప్రచారం సాగింది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

అయితే, ఈ ప్రచారంపై పరిశీలన చేస్తే, ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేలింది. కొందరు వైకాపా నేతలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై అసత్య ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. కేవలం మంత్రి పేరు దెబ్బతీయడానికే ఈ తప్పుడు వార్తలు పుట్టించారని మంత్రి అనుచరులు పేర్కొన్నారు.

మరోవైపు, మంత్రి అనుచరులు బహిరంగంగా సవాల్ విసిరారు – బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టినట్లు ఫుటేజ్ ఉంటే బయట పెట్టమని. యంగెస్ట్ మినిస్టర్‌గా ఉత్తరాంధ్రను అభివృద్ధి దిశగా నడిపిస్తూ అధినేత వద్ద మంచి గుర్తింపు పొందుతున్న సమయంలో, ఈ అసత్య ప్రచారాలు వ్యతిరేక పార్టీ నేతల కుట్రగా చూస్తున్నారు.

ఈ పరిణామం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వేడి చర్చకు కారణమవుతోంది.