Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 19,2023: నాన్నకు కావాలి సాయం, నమస్కారం కాదు అని భారతీయ యోగ సంస్థాన్ ఇందిరా పార్క్ యోగ గురు బి.సరోజని రామారావు, డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. జూన్18 ఫాదర్స్ డే సందర్భంగా ఇందిరా పార్క్ లో ఆదివారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, భారతీయ యోగ సంస్థాన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్తూరు బాలయ్య గుప్తా కుమారుడు ఒక పరిపూర్ణమైన, ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా నిలిచిన యోగా సాధకులందరిలో పెద్ద వారైన కొ.జయప్రకాష్, భారతీయ యోగ సంస్థాన్ ఇందిరా పార్క్ యోగా జోనల్ చీఫ్ బొబ్బిలి రామారావు, అడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్, రాజు నరసింహ సింగ్ లను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జి.కృష్ణ వేణి, కే. సరస్వతి, డా.గీత, పి.స్వరూపా రాణి, యశోద, శ్రీలత, శారద, అనిత, ఉషా, జ్యోతి, ధనలక్ష్మి, పూర్ణ, పవన్, ప్రకాష్, ఇంద్రజిత్, దేవేందర్ సింగ్ యోగా సాధకులు పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం సైనికులు పని చేస్తే, కుటుంబ రక్షణ కోసం నాన్న అహర్నిశలు పని చేస్తాడన్నారు.

ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ అయితే, ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేవాడు నాన్న’ అని అన్నారు. జీవన విధానాన్ని, నడక, నడవడిక, నాగరికత, సమాజంలో మనగలిగే ఒడుపు, లౌకిక వ్యవహారాలు, మనుగడకు మెలకువలు లాంటివెన్నో నేర్పించేది నాన్నే నన్నారు. తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకు నడిపించడమంటే దారి చూపడం కాదని, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమని తెలిపారు.

తనకు కలిగే కష్టాలు, తగిలే గాయాలు బహిర్గతం చేయని మగ మహారాజన్నారు. కాఠిన్యాలూ, కన్నెర్రజేయడాలూ ప్రేమలేక కాదు, దాన్ని వ్యక్తం చేయలేకా కాదు. ఎదుగుదల ఆగక, విజయపథంలో దూసుకు పోవాలన్న ఆరాటమే ఆయన్ని మౌనంగా ఉంచేస్తుందని చెప్పారు.

పిల్లలు గెలిచినప్పుడు మనసులోనే అభినందిస్తాడన్నారు. పిల్లలు ఓడిపోతే భుజం తట్టి ధైర్యం చెబుతారు అదే నాన్న నైజం, ఔన్నత్యం అని తెలిపారు.

తప్పటడుగుల వయసులో చేయూతనందించి, తెలిసీ, తెలియక చేసిన తప్పులను సరిదిద్దేదినాన్నేఅన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న ప్రేమిస్తాడు, ప్రేమను వ్యక్తం చేయడు. ఆదరిస్తాడు, ఆర్భాటం చేయడు. అందుకే అనాదిగా ఆయన పూజ్యనీయ స్థానంలోనే ఉన్నాడన్నారు.

error: Content is protected !!