365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 1,2025: వర్షాకాలం ప్రారంభమైన వెంటనే నగరంలో వరద, మురుగునీటి సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. ఈ సమస్యలపై పలు కాలనీ నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు.
ముఖ్యంగా కాలువలు సక్రమంగా అభివృద్ధి చేయకపోవడం, వాటికి అడ్డంకులు ఏర్పడటం వల్ల వర్షం పడినప్పుడు వీధులు, ఇళ్లు నీటమునిగిపోతున్నాయని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నం.5లోని వీధి నం.1లో 60 అడుగుల రహదారి లేఅవుట్ ప్రకారం ఉండాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం 20 అడుగులు మాత్రమే మిగిలాయని ఓ మాజీ కేంద్ర అధికారి ఫిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి మండలంలోని గోపన్నపల్లి విలేజ్‌లోని చిన్నా, పెద్ద చెరువుల కబ్జాలను నియంత్రించాలని ముప్పాస్ గ్రీన్ గ్రాండ్యుర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

వెంచర్ యాజమాన్యం చెరువులో రోడ్డు వేయడంతో పాటు చెత్త, మురుగునీరు చెరువులో పడేస్తున్నారని, దీంతో దుర్వాసన వ్యాపించి చేపలు కూడా చనిపోతున్నాయని వారు తెలిపారు.
సోమవారం నాటికి మొత్తం 43 ఫిర్యాదులు ప్రజావాణికి అందగా, వాటిని హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి…సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పణ..
ప్రజావాణిలో వచ్చిన కొన్ని ప్రధాన ఫిర్యాదులు:
బీఎన్‌రెడ్డి డివిజన్ (హయత్‌నగర్ మండలం):16 కాలనీల మురుగు, వరద నీరు కప్పల చెరువులో కలుస్తుండగా, ఇప్పుడు దానిని డైవర్ట్ చేసి రిజర్వు ఫారెస్టు వైపు మళ్లించడంతో కింది గ్రీన్‌సిటీ, లుంబినీ అలైట్, గాంధీనగర్, స్నేహమయినగర్ తదితర కాలనీలు నీటమునిగిపోతున్నాయి. కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన కాలువలో కలిపితే సమస్య తగ్గుతుందని వారు సూచించారు.
మాధాపూర్ (శేరిలింగంపల్లి మండలం):అయ్యప్ప సొసైటీ సమీపంలోని మెగాహిల్స్ వద్ద బండరాళ్లు, మట్టి వేయడం వల్ల మురుగునీటి ప్రవాహం ఆగిపోయింది. వర్షపు నీటితో పాటు మురుగునీరు కూడా నిలిచి ఇళ్లు నీటమునుగుతున్నాయి. ఒక ఇంటి గోడ కూలిపోయిందని స్థానికులు వాపోయారు. వెంటనే నీరు వెళ్లే మార్గం కల్పించాలన్నారు.

జిల్లేలగూడ (బాలాపూర్ మండలం):సయ్యద్ మసీద్ & గ్రేవ్‌యార్డు ప్రతినిధులు సర్వే నం.76లోని 1.28 ఎకరాల శ్మశానం భూమి కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు.
ప్రతాప్‌సింగారం (ఘట్‌కేసర్ మండలం):1988లో 25.17 ఎకరాల్లో 380 ప్లాట్లతో లేఅవుట్ ఆమోదం పొందినప్పటికీ, తరువాత కొందరు పట్టు పుస్తకాలు సృష్టించి భూమి ఆక్రమించారు. కోర్టు ఆదేశాల మేరకు వాటిని రద్దు చేసినా, ఒక పట్టు దారుడు కుమారుడు 6.15 ఎకరాలకు ప్రహరీ కట్టేశాడు. రహదారులు, పార్కులు కాపాడాలని ప్లాట్ యజమానులు విజ్ఞప్తి చేశారు.