365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, ఆగస్టు 18,2025: వర్షాకాలంలో వరద సమస్యలు, చెరువులు–నాలాలపై అక్రమాలు ప్రజల ప్రధాన ఆందోళనగా మారాయి. సోమవారం హైడ్రా ప్రజావాణికి వచ్చిన 39 ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం చెరువులు, నాలాల కబ్జాలపైనే ఉన్నాయి. కాలనీలు, రహదారులను వరద ముంచెత్తడానికి ఈ కబ్జాలే కారణమవుతున్నాయని ప్రజలు ఆరోపించారు. వెంటనే వాటిని తొలగించాలని కోరారు.

గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తే వరద ముప్పు గణనీయంగా తగ్గుతుందని ప్రజలు ఉదాహరణలతో వివరించారు. అలాగే, పార్కులు, ప్రభుత్వ భూములు, రహదారుల ఆక్రమణలపై కూడా పలు ఫిర్యాదులు అందాయి.

📌 ప్రధాన ఫిర్యాదులు:

సంతోష్‌నగర్ డివిజన్, ఐఎస్‌ సదన్ ప్రాంతం వరద నీటితో మునిగిపోతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు.

లంగర్‌హౌస్ బాపూఘాట్, టోలీచౌక్ వంతెన పరిసరాలు వర్షం వస్తే వెంటనే జలమయం అవుతున్నాయని పేర్కొన్నారు.

సోమాజిగూడ యశోద ఆసుపత్రి వద్ద నీరు నిలవడంతో పంజాగుట్ట కాలనీలకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.

జూబ్లీహిల్స్ సీవీఆర్ న్యూస్ కార్యాలయం వద్ద వరద నీరు నిలుస్తోందని, దాన్ని పక్కనే ఉన్న కేబీఆర్ పార్కులోకి మళ్లిస్తే సమస్య తగ్గుతుందని జర్నలిస్టు కాలనీ ప్రతినిధులు సూచించారు.

ప్రాంతాల వారీగా ముఖ్యాంశాలు:

నాచారం పారిశ్రామికవాడ:
సింగం చెరువు తండా నుంచి చెరువుకు వెళ్లే నాలా కబ్జా కావడంతో వరద ఇళ్లలోకి వస్తోందని ప్రజలు ఫిర్యాదు చేశారు. గ్రామ రికార్డుల ఆధారంగా సర్వే చేసి వెంటనే కబ్జాలు తొలగించాలని కోరారు.

మేడిపల్లి (మెడ్చల్-మల్కాజిగిరి):
పర్వతాపూర్ సాలార్‌జంగ్ కంచ్‌లోని 38 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిపై అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. హైడ్రా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి…“మైత్రివ‌నం వ‌ద్ద వ‌ర‌ద ఉధృతికి అడ్డుకట్ట.. కృష్ణాకాంత్ పార్కు చెరువుకు మళ్లింపు పరిశీలన”:ఏవీ రంగనాథ్‌

కాప్రా–ఈసీఐఎల్ (వంపుగూడ):
గోపాల్‌రెడ్డి నగర్‌లో 30 ఎకరాల HUDAs లేఅవుట్‌లో పార్కులు, రహదారులకు కేటాయించిన స్థలాలను తిరిగి ప్లాట్లుగా అమ్ముతున్నారని వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు చేసింది. ఇది లేఅవుట్ వేసిన వారి వారసులే చేస్తున్న అక్రమమని పేర్కొన్నారు.

జగద్గిరిగుట్ట (కుత్బుల్లాపూర్):
శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవస్థానం భూమి (2.5 ఎకరాలు) స్థానిక నాయకురాలు కబ్జా చేసిందని ఫిర్యాదు వచ్చింది. భూమిని రక్షించి దేవస్థానానికి అప్పగించాలని ప్రజలు డిమాండ్ చేశారు.