365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ, ఆగస్టు 10, 2025: దేశంలో బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన యోధుడు, యువ నాయకులకు మార్గదర్శకుడిగా నిలిచిన దివంగత పుంజాల శివశంకర్‌ను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ కొనియాడారు. పుంజాల శివశంకర్ 96వ జయంతి వేడుకలను ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చందు జనార్దన్ మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా ఉద్యమ పోరాటంలో వెన్నంటి నిలిచిన గొప్ప నాయకుడు పుంజాల శివశంకర్ అని అన్నారు. స్వయంకృషితో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా ఎదిగి ఎంతోమంది కార్యకర్తలను ప్రోత్సహించి అగ్రస్థాయికి చేర్చారని కొనియాడారు.

నాయకుల స్మరణ..
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తాను శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడానికి పుంజాల శివశంకర్ గారే కారణమని, 1989లో తనకు వచ్చిన బీ-ఫామ్‌ను మార్చినప్పుడు, నేరుగా రాజీవ్ గాంధీ చేతుల మీదుగా మళ్ళీ బీ-ఫామ్ ఇప్పించారని గుర్తు చేసుకున్నారు.

కేంద్ర శాసనసభ్యులు బొండా ఉమ మాట్లాడుతూ, తాను తొలిసారిగా పుంజాల శివశంకర్ పేరును వంగవీటి మోహనరంగా గారి వద్ద విన్నానని, ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు.

సీనియర్ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, సామాన్య జీవితం నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన పుంజాల శివశంకర్.. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి న్యాయ సలహాలు అందించారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఆయన స్థానం చెరగనిదని కొనియాడారు.

పుంజాల శివశంకర్ చిత్రపటానికి నాయకులంతా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు జీ.గురునాథం, కాపునాడు అధ్యక్షులు గళ్ళ సుబ్రహ్మణ్యం, రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్, మా ఆర్ట్స్ బాబీ, తోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.