365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, జనవరి 6,2026: జగత్ప్రసిద్ధ ఆధ్యాత్మిక గ్రంథం ‘ఒక యోగి ఆత్మకథ’ (Autobiography of a Yogi) రచయిత, యోగదా సత్సంగ సొసైటీ (YSS) వ్యవస్థాపకులు పరమహంస యోగానంద జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తిరుపతిలో నూతన ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు.

తిరుపతిలో ఆధ్యాత్మిక నూతన అధ్యాయం
తిరుపతిలోని నలందా నగర్‌లో ఏర్పాటు చేసిన నూతన ధ్యాన మందిరాన్ని వైఎస్ఎస్ (YSS) ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితంలో గురువు ప్రాముఖ్యతను వివరించారు. “అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞాన జ్యోతిని వెలిగించేవారే గురువు. భగవంతుడి నిశ్శబ్ద స్వరాన్ని వినగలిగే శక్తిని గురువు ప్రసాదిస్తారు. దయ, క్షమ, సేవా భావం వంటి ఉన్నత లక్షణాలను అలవరచుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన” అని ఆయన ఉద్బోధించారు.

హైదరాబాద్‌లో భక్తిశ్రద్ధలతో పుష్పాంజలి
హైదరాబాద్ మధురానగర్‌లోని సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాల్‌లో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. క్రియాయోగ ధ్యానం, భజనలు ,పరమహంస యోగానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి బోధనలను స్మరించుకున్నారు.

పరమహంస యోగానంద: వెలుగు చూపిన ఆధ్యాత్మిక ప్రస్థానం
1893 జనవరి 5న గోరఖ్‌పూర్‌లో జన్మించిన ముకుంద లాల్ ఘోష్ (యోగానంద చిన్ననాటి పేరు), చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులయ్యారు. తన 17వ ఏట గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ ను కలుసుకోవడం ఆయన జీవితంలో కీలక మలుపు.

Read this also: New Yogoda Satsanga Meditation Centre Opens in Tirupati to Promote Spiritual Wellness..

Read this also: EBG Group Appoints Mrunal Thakur as Carlton Wellness Brand Ambassador

క్రియాయోగ వ్యాప్తి: శాస్త్రీయ ధ్యాన పద్ధతులను ప్రపంచానికి పరిచయం చేయడానికి 1917లో భారత్‌లో యోగదా సత్సంగ సొసైటీ (YSS) ,1920లో అమెరికాలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (SRF) ను ఆయన స్థాపించారు.

విశ్వవ్యాప్త బోధనలు: భగవంతుడిని కేవలం నమ్మడం మాత్రమే కాకుండా, ధ్యానం ద్వారా నేరుగా అనుభూతి చెందాలని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. అన్ని మతాల అంతస్సూత్రం ఒకటేనని ఆయన ప్రబోధించారు.

అజరామర గ్రంథం: ఆయన రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’ నేటికీ లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలుస్తోంది.

ఇదీ చదవండి :హైదరాబాద్‌లో ‘రివర్ మొబిలిటీ’ జోరు: ఒకేసారి 3 కొత్త స్టోర్ల ప్రారంభం..!

Read this also:River Mobility Expands Hyderabad Presence with Triple Store Launch..

నేడు ఆయన జయంతి వేడుకల సందర్భంగా, ధ్యానం ,క్రమశిక్షణ ద్వారా శాశ్వత ఆనందాన్ని పొందవచ్చని భక్తులు పునరుద్ఘాటించారు.