365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,4 జూన్ 2023: రెండు తెలుగు రాష్ట్రాలోని పేదలకు, అభిమానులకు, సినీ కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహించనున్నట్లు మెగాస్టార్ స్టార్ చిరంజీవి అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో జరిగిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తన ఉన్నతికి కారణమైన సినీ ఇండస్ట్రీకి, అభిమానులకు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ తపించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. తన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ప్రారంభించి 10 లక్షల యూనిట్స్ సేకరించి పేదలకు, అవసరార్థంలో ఉన్న పేద వారికి రక్తాన్ని అందజేశారు. అలాగే, ఐ బ్యాంక్ ద్వారా 70 వేల మందికి corneal transplants చేయించడం ద్వారా తిరిగి కనుచూపు వచ్చేలా చేశారు.
కరోనా సమయంలో సినీ కార్మికులకు కోటి రూపాయల విరాళం ప్రకటించటమే కాకుండా సీసీసీని స్థాపించి ఇండస్ట్రీ సహా ఇతరుల నుంచి విరాళాలను సేకరించి కార్మికుల కుటుంబాలను ఆదుకుని తన పెద్ద మనసుని చాటుకున్నారు.
అలాగే ఓ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు సినీ కార్మికులు, మీడియా ప్రతినిథులు సదరు సెంటర్‌లో పరీక్షలు చేయించుకున్నప్పుడు 50 శాతం రాయితీని పొందేలా చేశారు. అలాగే ఇప్పుడు మరోసారి సినీ ఇండస్ట్రీకి పెద్ద కొడుకుగా భుజం కాయటానికి తానెప్పుడూ సిద్ధమేనని నిరూపించారు.
శనివారం స్టార్ హాస్పిటల్ క్యాన్సర్ స్క్రీనింగ్ స్కాన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు, సినీ కార్మికులకు క్యాన్సర్ సంబంధిత స్క్రీనింగ్ క్యాంప్స్‌ను ఏర్పాటు చేయాలని అందుకు అయ్యే ఖర్చంతా ఏదైనా తాను భరిస్తానని, అందుకు క్యాన్సర్ సెంటర్ వారు కూడా అందుకు అండగా నిలబడాలని రిక్వెస్ట్ చేశారు.
క్యాన్సర్ వల్ల ఎందరో ఇబ్బందులు పడుతున్నారని,అయితే అవగాహన ఏర్పరుచుకుని ఎప్పటికప్పుడు సరైన చికిత్సలు చేయించుకోవటం ద్వారా ప్రాథమిక దశలోనే దాన్ని గుర్తించి నిరోధించవచ్చునని చిరంజీవి తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా.గోపీచంద్ మన్నం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…‘‘డాక్టర్స్ ఇచ్చే హ్యుమన్ టచ్ చాలా గొప్పగా ఉంటుంది. ఈ రోజు స్టార్ క్యాన్సర్ సెంటర్ నా చేతుల మీదుగా ప్రాంభించటం ఎంతో ఆనందంగా ఉంది. సాధారణంగా మనం అందరం అనారోగ్యానికి గురవుతున్నామని అన్నారు.
మరీ ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారితో సామాన్యులు పోరాడుతున్నారు. గత ఏడాది 19 లక్షలు మంది క్యానర్స్ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
అందుకు కారణం మన ఆహారపు అలవాట్లు.. పరిసరాలు ఇలా ఏవైనా కావచ్చు. అలాగే ప్రజల్లోనూ క్యాన్సర్ పట్ల ఎలాంటి అవగాహన లేక పోవటం వల్ల ఆ మహమ్మారి బారిన పడుతున్నారు.
క్యాన్సర్‌ను ప్రాథమిక స్టేజ్‌లో గుర్తిస్తే దాన్ని మనం నివారించుకోవచ్చు. నేను ఆరోగ్యంగా ఉంటాను. చక్కటి ఆహారం తీసుకుంటాను అనే భావనలో ఉంటాను. అలాంటి నేను కూడా ఈ మధ్య కాలంలో ఏఐజీ హాస్పిటల్‌లో కొలొనో స్కోప్ టెస్ట్ తీసుకున్నాను.
అందులో నాన్ క్యాన్సర్ పాలిప్స్‌ను గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వాటిని అలాగే వదిలేస్తే అది క్యాన్సర్‌గా కూడా పరిణమించవచ్చునని భావించి డాక్టర్స్ వాటిని తీసేశారు.
ప్రాథమికంగా గుర్తించటం వల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు. అవగాహన అనేది లేకపోయుంటే ఇబ్బందిగా మారేదేమో. మన చేతుల్లో ఉండి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి విషయాలపై అవగాహన ఎంతో అవసరం. ముందుగా ఆరోగ్యపరమైన మెడికల్ స్క్రీనింగ్, స్కాన్ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ వంటి మహమ్మారిని నిరోధించవచ్చు”.
ఈ సందర్భంగా గోపీచంద్‌గారికి ఓ రిక్వెస్ట్.. క్యాన్సర్‌కి సంబంధించిన టెస్టులు చేయించుకుంటుంటారు. చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్లాలనేది, ఏ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలనేది తెలియదు.
సందిగ్ధంలో ఉంటారు. ముఖ్యంగా నా అభిమానులకు గిఫ్ట్‌గా, భరోసాగా మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి మీరు అభిమానులకు ఏదైనా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
అలాగే సినీ కార్మికుల్లో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు. వారు కొండనక, కోననక, దుమ్ము, దూళిలో పని చేస్తున్నప్పుడు ఎవరికీ ఏ రకమైన సమస్య వస్తుందో తెలియదు. ఊపిరితిత్తుల సమస్య రావచ్చు. ఇంకేదైనా రావచ్చు. అలాంటి పేదవారికి ఏమైనా చేయగలమా!, ముందస్తుగా ఏమైనా కనిపెట్టగలమా!
స్క్రీనింగ్ టెస్టులులాంటివి ఏమైనా ఆయా జిల్లాలో చేస్తే.. ఆ ఖర్చు నేను భరిస్తాను. మనం అందరం పరస్పరం భరించుకుందాం. దేవుడు నాకు కోట్లు ఇచ్చాడు. ఎన్ని కోట్లు అయినా నేను భరించగలను. అవకాశాలేమైనా ఉంటే పరిశీలించండి’’ అన్నారు చిరంజీవి.